
వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
25 జబ్బులను నయం చేయగలిగే శక్తి ఉంది
హిమాయత్‌నగర్: కల్లు చీప్ డ్రింక్ కాదని, 25 జబ్బులను నయం చేయగలిగే శక్తి కల్లులో ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జ్వరం తగ్గాలన్నా.. కిడ్నీలో రాళ్లు పోవలన్నా, బాలింత ఆరోగ్యంగా ఉండాలన్నా, అమ్మవారు సోకినా కల్లు ఔషధంగా ఉపయోగించేవారన్నారు. అలాంటి కల్లు వృత్తి చేస్తున్నామని చెప్పుకోవడంలో వృత్తిదారులు సిగ్గుపడడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హిమాయత్‌నగర్‌లోని గౌడ హాస్టల్ 67వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. వృత్తిదారులు చేసుకోవాల్సిన కల్లు వ్యాపారంలో ఇతరులు చొరబడటం వల్లే ఎక్సైజ్ అధికారు దాడులు చేయడం, కేసులు పెడుతున్నారని, ఈ కారణంగానే వృత్తి రోజు రోజుకూ నీరుగారిపోతోందన్నారు.
ఈ వృత్తిని సంరక్షించుకొనేందుకు ఒక్కో విద్యార్థి పది నుంచి పదిహేను తాటి, ఈత చెట్లను గ్రామాల్లో నాటాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇందుకు ప్రభుత్వం మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదని, మిమ్మల్ని కష్టపడి ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రులకు సుఖసంతోషాల కోసం ఇతర ప్రైవేటు రంగాలను కూడా ఎంచుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ పోటీ పరీక్షలపై అధిక సమయం కేటాయించే కన్నా జీవితంలో త్వరగా స్థిరపడే మార్గాన్ని ఎంచుకోవలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌడ హాస్టల్స్‌ను విస్తరించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ హాస్టల్ అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఎ.సాయిబాబా గౌడ్, డాక్టర్ జి.జగదీష్‌గౌడ్, టి.రోహిణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.