
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గోదాముల నిర్మాణానికి సహకరించాలని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రతినిధులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన వేర్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల పంటలన్నీ నిల్వ చేసేందుకు గోదాములను ఉపయోగిస్తామన్నారు. మంచి ధర వచ్చినప్పుడు, వీలైనప్పుడు అమ్ముకునే పరిస్థితి రైతులకు రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.వెయ్యి కోట్లతో నాబార్డు సహకారంతో 336 ఆధునిక గోదాములను నిర్మించినట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల రాకతో పంట దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నిర్మించిన గోదాములు సద్వినియోగం అవుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ తరపున తెలంగాణలో అత్యధికంగా గోదాములను నిర్మించాలని కోరారు. భవిష్యత్ అవసరాల కోసం మరిన్ని గోదాముల నిర్మాణం తప్పనిసరని, కాబట్టి కేంద్రం సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనిపై కార్పొరేషన్ ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment