ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టడంతో...
జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసునమోదు
బంజారాహిల్స్: ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనం నడుపుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72లోని నవనిర్మాణ్ నగర్‌కు చెందిన సుమలత(24) మంగళవారం ఉదయం సమీపంలోని గుడికి వెళుతుండగా అతివేగంగా వచ్చిన ఏపీ33 జే1 ఆడీ కారు ఆమెను ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఆమె గాయపడడంతో గుర్తించిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని ఆస్పత్రిలో చికిత్స చేయిస్తానని కారులో ఎక్కించుకుని, 5 కిలో మీటర్ల దూరంలోని నానక్‌రాం గూడ చెరువు సమీపంలో ప్రదేశంలో వదిలేశాడు. ఆమె చేతిలో రూ.100 పెట్టి తాను మంత్రి గంటా డ్రైవర్‌నని, ఈ విషయం బయటకు చెబితే అంతుచూస్తానని హెచ్చరించాడు. దీంతో భయాందోళనకు గురైన సుమలత రోడ్డుపైకి నడుచుకుంటూ వచ్చి తనభర్త వెంకన్నకు ఫోన్ చేయడంతో ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.