ఎమ్మెల్సీ ఎన్నికకు మిగిలింది..పది రోజులే! | MLC election only ten days | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఎన్నికకు మిగిలింది..పది రోజులే!

Published Fri, Mar 13 2015 12:15 AM | Last Updated on Tue, Jun 4 2019 6:34 PM

MLC election only ten days

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో రాజకీయ రంగం వేడెక్కుతోంది. టీఆర్‌ఎస్, వామపక్షాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వీరికి ఆయా పార్టీలు, అనుబంధ సంఘాల కేడర్ పూర్తిస్థాయిలో సహకరిస్తుండడంతో ఇప్పుడు ఈ మూడు జిల్లాలు ఎన్నికల ప్రచారంలో తడిసి ముద్దవుతున్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ  : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్‌కు మరో పదిరోజులు మాత్రమే మిగిలిన ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. శుక్రవారం జిల్లాలో ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తనుంది. టీఆర్‌ఎస్ పక్షాన ఇద్దరు డిప్యూటీ సీఎంలు మహమూద్‌అలీ, కడియం శ్రీహరి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననుండగా, వామపక్షాల అభ్యర్థి తరఫున వామపక్షాల రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి తదితరులు భువనగిరి, నకిరేకల్, నల్లగొండలలో ప్రచారం చేయనున్నారు.
 
 ప్రతిష్ట కోసం అధికార పార్టీ...
 ముఖ్యంగా ఈ ఎన్నికలలో హాట్‌ఫేవరేట్‌గా బరిలో ఉన్నారు టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థే గెలుపొందడంతో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో ఉన్న ఆయన తన స్థాయికి తగ్గకుండా ప్రచారంలో ముందుకెళుతున్నారు. విద్యారంగంతో పా టు ఇతరత్రా తనకున్న పరిచయాలతో ఆయన మూడు జిల్లాలను ఇప్పటికే చుట్టేశారు. తన గెలుపు మీద టీఆర్‌ఎస్ ప్రతిష్ట ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం లో ఉన్న మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ఆయన ముందుకెళుతున్నారు. ముఖ్యంగా పీఆర్సీతో సంతృప్తిగా ఉన్న ఎన్జీవోలు, టీచర్లు తనకు సహకరిస్తారనే గంపెడాశతో ఆయన ఉన్నారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. తనకు వీలున్నప్పుడల్లా జిల్లాలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూనే గెలుపు కోసం వ్యూహరచనలు చేస్తున్నారు. ఇక, మూడు జిల్లాల్లోని టీఆర్‌ఎస్ కేడర్ కూడా పల్లా విజయం కో సం కృషి చేస్తోంది. ఇప్పటివరకు ప్రచారంలో మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే అధికార పార్టీ అభ్యర్థిగా రాజేశ్వరరెడ్డి ముందంజలో ఉన్నప్పటికీ, ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రచారం చేయాల్సి ఉందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 
 సత్తా చూపిస్తామంటున్న వామపక్షాలు
 అధికార టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇస్తారని భావిస్తున్న వామపక్షాలు బలపరుస్తున్న సూరం ప్రభాకర్‌రెడ్డి కూడా ప్రచారంలో తనదైన శైలిలో వెళుతున్నారు. వామపక్ష నేపథ్యం నుంచి వచ్చిన ఆయన తనకు మూడు జిల్లాల్లో ఉన్న పరిచయాలతో చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ వెళుతున్నారు. పది వామపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, ప్రజాసంఘాలు కూడా ఆయన గెలుపు కోసం పనిచేస్తున్నాయి. ఈనెల 13వ తేదీ నుంచి ఈ పార్టీల ముఖ్య నేతలంతా మూడు జిల్లాల్లో ప్రభాకర్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ బస్సుయాత్రను చేపట్టనున్నారు. జిల్లాలోని భునవగిరి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, న్యూడెమొక్రసీ నేత గోవర్ధన్ తదితరులు హాజరుకానున్నారు. భువనగిరి, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేటల్లో వామపక్షాల సానుభూతిపరులు, గ్రాడ్యుయేట్లతో వీరు రెండురోజుల పాటు సమావేశాలు నిర్వహించి ప్రచార సరళిలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, ఎన్నికల వ్యూహాలు, ప్రచార సరళి ప్రణాళిక విషయంలో ఆయన కొంత వెనుకబడ్డట్టు కనిపిస్తోందని రాజకీయ వర్గాలంటున్నాయి.
 
 సై అంటున్న బీజేపీ, కాంగ్రెస్
 ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఎన్నికలలో ఢీ అంటే ఢీ అంటోంది. ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా ఎప్పుడో ఖరారయిన ఎర్రబెల్లి రామ్మోహనరావు ఇతర అభ్యర్థుల కంటే ముందుగానే మూడు జిల్లాలు తిరిగారు. సామాజిక సేవకుడిగా తాను చేస్తున్న కృషిని గుర్తించాలని కోరుతూ ఇప్పటికే ఆయన ఓ మారు ప్రచారాన్ని పూర్తి చేశారు. అయితే,  ఈ మూడు జిల్లాల్లో పార్టీ కేడర్ అంతగా లేకపోవడంతో ఆయనకు ఏ మేరకు ఓట్లు పడతాయనేది తేలాల్సి ఉంది. ఈ నెల 14, 15 తేదీల్లో కేంద్రమంత్రులు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడిలు పర్యటించనున్నారు. ఇక, మొదటి సారి బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పోటీచేస్తున్నారు. ఆయన కూడా తన వంతు ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే, ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకత్వం పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో దిగకపోవడంతో పూర్తిస్థాయిలో ప్రచార పర్వంలో ముందుకెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు.
 
 అయితే, ఈనెల 17న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలను మూడు జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, 14-19 వరకు యూత్‌కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించాలని పార్టీ అగ్రనేతలు నిర్ణయించడంతో ఆయన ప్రచారంలో కొంత ఊపు కనిపించనుంది. ఇక, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న వారిలో పెద్దగా పోటీ కనిపించనప్పటికీ రమణానాయక్ లాంటి అభ్యర్థులు తమ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లను తమ వైపు మల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇదిలా ఉంటే అభ్యర్థులు తమ మేనిఫెస్టోతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు గాను ఓ అభ్యర్థి ఇంటింటికి వెళ్లి తాయిలాలు అందజేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రానున్న పదిరోజులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరింత ఊపుతో కొనసాగనుండగా, ఈనెల 22న జరగనున్న పోలింగ్ కోసం పట్టభద్రులు కూడా అదే ఊపుతో ఎదురుచూస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement