ఎమ్మెల్సీ పోలింగ్ నేడే..
► తెలంగాణలో ఒకటి, ఏపీలో ఐదు స్థానాలకు ఎన్నికలు
► ఏర్పాట్లు పూర్తి:భన్వర్‌లాల్
హైదరాబాద్: హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో 23,789 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఓటుహక్కు విని యోగించుకోనున్నారు. గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 126 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు ఓటింగ్ కౌంటర్లుంటాయి. ఈ ఎన్నికల కోసం మొత్తం 12 మంది అభ్య ర్థులు పోటీ పడుతున్నారు. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ స్థానంతోపాటు ఏపీలోని ఐదు స్థానాలకు కూడా గురువారమే పోలింగ్ జరగనుంది. ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించేందుకు సహకరించాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఓట ర్లకు విజ్ఞప్తి చేశారు.ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన బుధవారం సచివాలయం లో విలేకరులతో మాట్లాడారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు పోలింగ్ కేంద్రాల్లోకి తీసుకెళ్లటాన్ని నిషేధించారు. పాత ఓటర్ల జాబితాలు ఈ ఎన్నికకు చెల్లుబాటు కావని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన కొత్త ఓటర్ల జాబితాలను మాత్రమే పరిగణన లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, సర్వీస్ ఐడీ కార్డు, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఏదైనా ఒకటి చూపిం చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నా రు. అక్రమంగా ఓటు వేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఓటేసేటప్పుడు జాగ్రత్త...
ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉంచిన వయెలెట్ కలర్(ఊదా) స్కెచ్‌తోనే ఓటు వేయాలి. ఓటు వేసేటప్పుడు నంబర్లను మాత్రమే వేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను వాడుకొనే వీలుంది. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా పనివేళలు సడలించాల ని, షిప్టు పద్ధతి అనుసరించాలని భన్వర్‌లాల్ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.
రాజ్‌భవన్ క్వార్టర్లకు ముందే అనుమతి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే రాజ్‌భవన్ లో సిబ్బంది క్వార్టర్లు ప్రారంభించి గవర్నర్, సీఎం కోడ్‌ను ఉల్లంఘించారని బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదుకు భన్వర్‌లాల్ వివరణ ఇచ్చారు. ఆ కార్యక్రమానికి ముందుగా ఎన్ని కల కమిషన్ నుంచి అనుమతి తీసుకున్నాకే... ప్రారంభించారని ఆయన చెప్పారు.