కొత్తగూడెం: ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు
ఖమ్మంమయూరిసెంటర్ : కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో కార్మికులకు, కర్షకులకు కనీసవేతనం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు ఆరోపించారు. గురువారం ఖమ్మంలో సీఐటియూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జైల్‌భరో జరిగింది.
పెవిలియన్ గ్రౌండ్ నుంచి కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రదర్శనగా ధర్నాచౌక్‌కు బయల్దేరగా, మయూరిసెంటర్‌లో పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రదర్శకులకు మధ్య తోపులాటతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. నాయకులను అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. అంతకుముందు జరిగిన సభలో నున్నా నాగేశ్వరరావు, బి.మధు మాట్లాడుతూ.. నాలుగేళ్ల పాలన లో ప్రధాని మోదీ హామీలు ఒక్కటీ అమలు కాలేదన్నారు.
రైతు ఆత్మహత్యలు కొనసాగుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వరావు, జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వేదగిరి శ్రీనివాసరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి భారతి, టీమాస్ జిల్లా కన్వీనర్ యర్రా శ్రీకాంత్ పాల్గొన్నారు.
కొత్తగూడెంలో ఉద్రిక్తం
చుంచుపల్లి: కొత్తగూడెంలో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జైల్ భరో కార్యక్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ముందుగా పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్‌కు చేరుకున్న ప్రదర్శన కలెక్టరేట్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. కొం త సేపు ఉద్రిక్తత నెలకొంది.
ఆందోళనకారులను పోలీసుల అరెస్ట్ చేసి వన్‌టౌన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు అన్నవరపు కనకయ్య, అన్నవరపు సత్యనారాయణ, కున్సోతు ధర్మా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో రైతులు, కార్మికుల బతుకులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని, కార్పొరేట్ సంస్థల ఆస్తులేమో పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు కూడా కార్మికులను పట్టించుకోవడంలేద న్నారు.
17 రోజులు గా సమ్మె చేస్తున్నా పంచాయతీ కార్మికుల సమస్య లు పట్టడంలేదన్నారు. ఈ ప్రభుత్వాలకు కార్మికులు,కర్షకులు సరైన సమయంలో బుద్ధిచెపుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోత్ ధర్మా, వెంకన్న, కోబాల్, లక్ష్మి, జ్యోతి, జాటోత్ కృష్ణ, వినోద, కొక్కెరపాటి పుల్లయ్య, భూక్యా రమేష్, కొండపల్లి శ్రీధర్, నబీ, బాలరాజు, పిట్టల రవి, అర్జున్, వీర్ల రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment