
మాట్లాడుతున్న అజారుద్దీన్, పక్కన నామా తదితరులు
సాక్షి, ఖమ్మంసహకారనగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో ఘోరంగా విఫలమైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ విమర్శించారు. ఆదివారం నగరంలోని ఎస్ పార్క్ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధపడుతున్న కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్‌ను అమలు చేయటంలో ఘోరంగా విఫలమయిందని అన్నారు. ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతూ కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. నాలగున్నరేళ్లలో సెక్రటరియేట్‌కు రాని కేసీఆర్‌ను ఇక ఫాం హౌస్‌కు పరిమితం చేయాలని అన్నారు. ప్రజాకూటమికి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాకూటమి (టీడీపీ) అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మైనార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం పని చేసిందన్నారు. మైనార్టీలంతా ఆలోచించి ఓట్లు వేయాలన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరి అజ్మతుల్లా, ఏకె రామారావు, ఎండీ తాజుద్దీన్, చోటే బాబా, టీడీపీ నాయకులు బేగ్, సీపీఐ నాయకులు జానిమియా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment