నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ఇబ్బడి ముబ్బడిగా ఫీసులు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించే వ్యవస్థ కరువైంది. ఇంగ్లిషు మా ధ్యమం తప్పనిసరైన రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రై వేట్ స్కూళ్లలోనే చేర్పిస్తున్నారు. వీరి బలహీనతను కాన్వెంటు స్కూళ్లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఫీజుల మోత మోగిస్తున్నా యి. ఇందుకోసం ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. విద్యాబోధన సరేగాని, దానికి అయ్యే ఖర్చు మాత్రం తల్లిదండ్రులకు మింగుడుపడడం లేదు. ఫీజుల నియంత్రణపై జిల్లా విద్యాశాఖ స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డొనేషన్లు, రూ. వేలల్లో ఫీజులు...
ఓ స్థాయి ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ ప్రవేశానికి స్కూల్ ఫీజు రూ.8 వేలు ఉండగా, డొనేషన్ల పేరిట రూ.12 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఇలా తరగతిని బట్టి డొనేషన్లు రూ.10 వేల నుంచి మొదలుకొని రూ. 25 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎల్ కేజీ, 1వ తరగతికే రూ. 8 వేల ఫీజు ఉండగా, 5 నుంచి 10వ తరగతుల వరకు రూ.10 వేలపైబడి ఫీజులు వసూలు చేస్తున్నారు.
వీటి కి ప్రత్యేకం...
కంప్యూటర్ శిక్షణ, ఐఐటీ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లిష్, ప్రత్యేక తరగతుల పేరిట అదనంగా రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలలోనే పుస్తకాలు కొనుగోలు చేయాలని మెలిక పెడుతున్నారు. దీనికి రూ. 6 నుంచి రూ. 7 వేలు నిర్ణయిస్తున్నారు. ఇందులో పాఠశాలకు చెందిన ప్రత్యేక స్టడీ మెటీరియల్ అంటగడుతున్నారు. ఒక్కో స్టడీ మెటీరియల్ రూ. 300 వరకు వసూలు చేస్తున్నారు.అలాగే కొన్ని పాఠశాలల్లో స్కూల్ డ్రెస్సులు కొనుగోలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు. దీనికి రూ. 600 నుంచి వెయ్యి వరకు డిమాండ్ చేస్తున్నారు.
వీటితో పాటు వందల రూపాయలు వెచ్చించి టై, బెల్డ్‌లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. వీటితో బస్సు సౌకర్యం కల్పిస్తూ నెలకు రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఫీజును నిర్ణయించి గుంజుతున్నారు. దీంతో ఒక్కో విద్యార్థిపై వేలల్లో ఫీజుల భారం పడుతోంది. వీటి ఖర్చులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు ఆస్తులను అమ్మడం, లేకపోతే అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాలల ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించడం, డొనేషన్లు వసూళ్లు చేస్తున్నాయి.
వీటి నియంత్రించాల్సిన విద్యాశాఖ స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు టెక్నో, డిజిటల్, ఐఐటీ తదితర పేరిట బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారాన్ని చేస్తున్నాయి. ఇలా ప్రచారం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా ఇలా బోర్డులు చేస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి.ఏటా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి. చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదు. రేకుల షెడ్‌లలో తరగతులు నిర్వహించరాద నే నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాలో చాలాచోట్ల రేకుల షెడ్లలోనే ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీటన్నింటిపై విద్యాశాఖ పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రైవేటు ఫీసులు
Published Sat, May 31 2014 2:41 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement