వేషాలు వేయొద్దు..
ఏన్కూరు: ‘చెరువు అభివృద్ధి పనుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా.. ఎన్నాళ్ల నుంచి చెరువు పనులు జరుగుతున్నాయి. పనులు పారదర్శకంగా నిర్వహించాలి. వేషాలు, డ్రామాలు వేయొద్దు’ అని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ అధికారులపై మండిపడ్డారు. మండల కేంద్రంలోని ఊరచెరువు అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. చెరువు పనులు ఎప్పుడు ప్రారంభించారు. చెరువు ఆయకట్టు కింద ఎన్ని ఎకరాలు భూమి ఉన్నది.. ఇప్పుటి వరకు ఏం పనులు చేశారు?, పనులు నాణ్యతగా చేస్తున్నారా?
పనుల రికార్డులు చూపించండి అని ఇగిరేషన్ శాఖ అధికారులను అడిగారు. వారు సరైన రికార్డులు చూపించకపోవడంతో ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సంవత్సరాలు నుంచి ఉద్యోగం చేస్తున్నారు?, డ్రామాలు, వేషాలు వేయకండి, పనులు రైతులకు ఉపయోగపడేలా చేయండి అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు, అధికారులు చెరువు పనుల్లో భాగస్వామ్యం పెంచాలని కోరారు. చెరువు కట్టలపై రోలర్ తిరిగించాలన్నారు. తూములు, అలుగుల నిర్మాణం పటిష్టంగా ఉండాలన్నారు.
ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనులను పటిష్టంగా చేయూలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఎంపీ వెంట ఎంపీపీ బాణోత్ మాధవి, జెడ్పీటీసీ కోపెల శ్యామల, తహశీల్దార్ పూసా సాంబశివరావు, ఎంపీడీవో కె.పాపారాణి, ఇరిగేషన్ డీఈ అంజయ్య, ఏఈ భగీరథబాబు, వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొర్రా రాజశేఖర్, నాయకులు సూతకాని జైపాల్, ముక్తి వెంకటేశ్వర్లు, నల్లమల వెంకటేశ్వర్లు, శివకుమార్, డి.రామారావు, లచ్చిరాంనాయక ఉన్నారు.