రియల్ హీరో | muthireddy yadagiri reddy biography | Sakshi
Sakshi News home page

రియల్ హీరో

Published Sun, Aug 31 2014 4:18 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

రియల్ హీరో - Sakshi

రియల్ హీరో

  • పదో తరగతిలోనే తెలంగాణ ఉద్యమంలోకి..
  •  పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి మిత్రుడిని విడిపించుకున్నా
  •  25పైసల కోసం ఆటోలు కడిగా
  •  తప్పుచేస్తే తిరగబడేటోడిని..
  •  కలెక్టర్‌నే అందరిముందు నిలదీశా
  •  జిల్లాలో మొట్టమొదట బెంజికారు కొన్నది నేనే..సోనియాగాంధీ ఎంపీ టికెట్ ఇవ్వాలనుకున్నారు
  •  మూడో ప్రయత్నంలో పొన్నాలపై గెలిచా
  •  జనగామను అభివృద్ధిచేసి ప్రజల రుణం తీర్చుకుంటా
  •  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అంతరంగం
  • ఆయన చూడడానికి ‘అంకుశం’ సినిమాలో విలన్ రాంరెడ్డి మాదిరిగా ఉంటారు. కానీ, నిజ జీవితంలో మాత్రం హీరోనే. కష్టాలు ఎదురైనా మనోస్థైర్యంతో ఎదుర్కొన్నారు. దసరా రోజు పస్తులున్న దుర్భరస్థితి నుంచి జిల్లాలోనే బెంజికారు కొన్న మొదటి వ్యక్తిగా నిలిచారు. చిన్నప్పటి నుంచీ తెగింపు స్వభావం. పదో తరగతిలోనే తెలంగాణ ఉద్యమంలో పోలీస్ స్టేషన్‌పై దాడిచేసి మిత్రుడిని విడిపించుకున్నారు. ఉద్యమం వద్దని తన మేనమామ మందలించడంతో హైదరాబాద్ బాట పట్టి ఆటో డ్రైవర్‌గా మారారు. యూనియన్‌కు అధ్యక్షుడిగా కూడా అయ్యారు. ఆ తర్వాత ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించారు. అందులో జరుగుతున్న అవినీతిని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి అభినందనలతో పాటు ప్రమోషన్లు పొందారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం (సర్వేయర్) చేపట్టి ఎన్నో సంవత్సరాలుగా పంపిణీకి నోచుకోని భూమిని పేదలకు పంచి వారికి దేవుడయ్యారు. ఆ సందర్భంలో కలెక్టర్‌తో జరిగిన వాగ్వాదంలో కలెక్టర్ చొక్కాపట్టి లాగడంతో ఉద్యోగం పోయింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిచయంతో ఆ రంగంలో అడుగుపెట్టి తొలిసారే రూ.1.50 లక్షల లాభం సంపాదించారు. ఆ తర్వాత రాజకీయ రంగం.. మొదట కాంగ్రెస్‌లో చేరినా సరైన అవకాశాలు రాలేదు. టీఆర్‌ఎస్‌లో చేరి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పొందినా.. మూడోసారి అనూహ్యంగా పీసీసీ అధ్యక్షుడిపై గెలిచి రాష్ట్రవ్యాప్తంగా హీరో అయ్యారు. నోమారెడ్డి.. కబడ్డీరెడ్డి, ముత్తిరెడ్డిగా పిలువబడుతున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అంతరంగం.. ఈ వారం ప్రత్యేకం..
     
    వర్ధన్నపేట మండలం పున్నేలు మా సొంతూరు. నాన్న గోపాల్‌రెడ్డి, అమ్మ కౌసల్యదేవి. అన్న, తమ్ముడు, ఇద్దరు అక్కలు. భార్య పద్మలతారెడ్డి. ఆమెది మా మండలంలోనే  లింగమారిగూడెం. మాకు ఇద్దరు పిల్లలు. కుమారుడు పృథ్వీరాజ్‌రెడ్డి సివిల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్ పూర్తి చేసి వ్యాపారాలు చూస్తున్నాడు. కూతురు తుల్జాభవానీ మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పూర్తి చేసింది. నా జన్మనామం నోమరెడ్డి. ఈ పేరుతోనే వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి.  

    మొదట మా ఊళ్లోనే చదువుకున్నా. టెన్త్ కోసం మా ఊరు నుంచి మూడు కిలోమీటర్లు నడిచి బొల్లికుంట వెళ్లేవాడిని. చిన్నప్పుడు కబడ్డీ బాగా అడేవాడిని. అప్పుడు నన్ను కబడ్డీ రెడ్డి అనేటోళ్లు. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు వరంగల్ నగరం హన్మకొండ చౌరస్తా నుంచి రంగశాయిపేట వరకు తూర్పు డివిజన్‌గా, హన్మకొండ చౌరస్తా నుంచి కాజీపేట వరకు పశ్చిమ డివిజన్‌గా ఉండేది. అప్పుడు పీయూసీ(పదో తరగతి) పరీక్షలు మొదలయ్యాయి.

    పరీక్షలు నిలిపివేయాలన్న నిర్ణయం మేరకు స్కూళ్లోకి వెళ్లి అన్ని ప్రశ్నపత్రాలు తీసుకొచ్చాను. అప్పుడు వెంకట్రామిరెడ్డి అని ఇన్‌స్పెక్టర్ ఉండె. పేపర్లు తీసుకొస్తున్న నన్ను పట్టుకునేందుకు బాగా ప్రయత్నించిండు. నేను బాగా ఉరికిన. చివరికి గోడ దూకే క్రమంలో దెబ్బతాకింది. అక్కడే బాయిలో పడబోయిన. ఇన్‌స్పెక్టర్ కాపాడి ఎంజీఎంలో చేర్పించిండు. అప్పుడు చెన్నారెడ్డి వచ్చి నన్ను పరామర్శించిండు. నిన్ను తరిమింది ఎవరో చెప్పు అని అడిగిండు. కాపాడింది వెంకట్రామిరెడ్డి అని చెప్పిన.

    ఆ ఇన్‌స్పెక్టర్ కళ్లల్లో నీళ్లు తిరిగినయి. ఉద్యమం విషయంలో నన్ను ఎలాగైనా పట్టుకోవాలని మా ఫ్రెండ్ అఫ్జల్‌ను రంగశాయిపేట పోలీసుస్టేషన్‌లో పెట్టిండ్లు. అక్కడికి సమీపంలోని కొందరు ఆంధ్రావాళ్ల ఇళ్లు ఉండేవి. వాళ్ల పొగాకు వాములకు నిప్పు పెట్టాం. పోలీసులు అక్కడికి వెళ్లిన  సమయంలో మా ఫ్రెండ్‌ను బయటికి తీసుకొచ్చాం. మా ఫ్రెండ్ వాళ్ల నాన్న అప్పుడు తహసీల్దారు. ఆయన సస్పెండ్ అయ్యారు. ఉద్యమం కారణంగా ఒక విద్యాసంవత్సరం వృథా అయింది. తర్వాత ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1972లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన.
     
     మేనమామ మాటలే...
     
    ఇంటర్మీడియట్‌లో ఉద్యమం తీవ్రత తగ్గినా దూకుడుగానే ఉండేవాడిని. మా అమ్మమ్మ ఊరు కట్య్రాల. ఒకరోజు అక్కడ ఒక ఫంక్షన్‌కు వెళ్లా. మా మేనమామ పోలీసు పటేల్. చక్కగా చదువుకోక ఏందిరా ఈ పనులు అని అందరి ముందు నన్ను గట్టిగా నిలదీశాడు. బాధపడ్డా. నేను ఎంటో చూపిస్తా అని తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయా. వరంగల్‌కు వచ్చి అక్కడ నుంచి రైళ్లో సికింద్రాబాద్ వెళ్లిపోయా. అక్కడ ఓ ఆటో డ్రైవర్ వద్ద ఉండేవాడి ఆటోలు కడిగేవాడిని. ఒక ఆటో కడిగితే 25పైసలు ఇచ్చేవారు. రాత్రిళ్లు ఆటో డ్రైవింగ్ నేర్చుకునేవాడిని. ఆ తర్వాత ‘ఆమ్‌ప్రోచ్’ ఫ్యాక్టరీలో చేరాను. భోజనం ఖర్చుపోను నెలకు రూ.88మిగిలేవి. అక్కడ సూపర్‌వైజర్ చేసే అక్రమాలను పైఅధికారులకు చెప్పాను. వారు విచారించి అత డిని పనిలో నుంచి తొలగించారు. దీంతో నాకు స్టోర్‌కీపర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. మరో డిపార్ట్‌మెంట్‌లో అక్రమాలను గుర్తించి చెబితే సూపర్‌వైజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. రెండు నెలల్లోనే మంచి హోదా వచ్చింది. ఇంట్లో నుంచి వెళ్లిన నాలుగు నెలల్లోనే తహసీల్దారుతో సమానంగా రూ.250 జీతం వచ్చేది. ఈలోపు మా వాళ్లు నా అచూకీ కోసం డెక్కన్ క్రానికల్, ఆంధ్రప్రభ ప్రతికల్లో ప్రకటనలు వేశారు. చూసినా నేను స్పందించలేదు. నాలుగు నెలల తర్వాత యాదగిరిగుట్టలో గుండు చేయించుకుని... నాన్నకు దోతులు, అమ్మకు చీరలు తీసుకుని ఇంటికి వెళ్లా. అప్పుడు అందరు చూసి నన్ను అభినందించారు.
     
    కలెక్టర్‌తో గొడవ

     
    రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ సర్వేయర్ ఉద్యోగం చేస్తున్నా.. అప్పుడు డిప్యూటీ కలెక్టర్‌గా షీలాబేడీ ఉండేవారు. ఆమె బాగా స్ట్రిక్ట్ అధికారి.  క్లిష్టమైన అంశాల్లో నన్ను తీసుకెళ్లేవారు. ఒకసారి పరిగి డివిజన్ కొత్తపల్లిలో భూ పంపిణీ చేయాల్సి వచ్చింది. అక్కడ 250 ఎకరాల ప్రభుత్వ భూమిని 125 కుటుంబాలకు పంచాలి. 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్ మళ్లీ ఆదేశాలు ఇవ్వడంతో నేను అక్కడికి వెళ్లా. అప్పటికే అక్కడ అటవీశాఖ వాళ్లు టేకు చెట్లు పెట్టారు. రికార్డులను పరిశీలించాను. ప్రభుత్వ భూమి అని ఉంది. ఆ ఊరి వారు మొదట నన్ను పట్టించుకోలేదు. అందరు రావడం ఎంతోకొంత తీసుకుని వెళ్లిపోవడం సహజమనే అన్నారు. కానీ, నేను గ్రామస్తులో చైతన్యం నింపాను. ఒక్క పూటలో టేకు చెట్లు నరికించి వాటినే హద్దులుగా పెట్టి పంపిణీ చేశాను. అటవీ శాఖ వారు, పోలీసులు వచ్చి అడ్డుకోబోయారు. నా ఆదేశాలతో ఊరి వాళ్లు తిరగబడ్డారు. చివరికి డీఎస్పీ, కలెక్టర్ జోక్యం చేసుకున్నారు. నన్ను అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. తెల్లారి నన్ను పిలించారు. కలెక్టర్ అన్ని వివరాలు అడిగారు. రోజంతా విచారణ చేశారు. మొత్తం వివరించా. నేను చేసింది కరెక్ట్ అన్నారు. మిగితా అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు అన్నారు. చివరికి నాపై కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు జడ్జిమెంట్ ఇస్తవా అన్నారు. మీరు ఇచ్చిన ఆదేశాలో అమలు చేశా అని చెప్పా. అయినా అసలు విషయం పక్కనబెట్టి నీ తీరు సరిగా లేదు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడబోయారు. నేను ఎంత చెప్పినా వినలేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక కలెక్టర్ చొక్కా పట్టుకున్నా. ప్రభుత్వ వ్యవస్థ ఇలా ఉండడం సరికాదని గట్టిగా చెప్పి వచ్చేశా. నన్ను సస్పెండ్ చేశారు. ఏడాదిలోపే మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. అయినా నేను జాయిన్ కాలేదు.
     
    దసరా రోజు తిండిలేదు


    మొదటిసారి ఇంటికి వెళ్లి వచ్చాక హైదరాబాద్‌లో డ్యూటీకి పోతున్నా. ఆరోజు కైసర్ అని పహిల్వాన్ నాకు ఎదురుపడి ఉద్యోగం మానేయాలని బెదిరించాడు. ఉద్యోగానికి వెళ్లలేదు. దసరా ముందు ఇది జరిగింది. దసరా రోజు అన్నం దొరకలేదు. ఉపవాసం ఉన్నా. జీవితం మళ్లీ మొదటికి వచ్చింది. ఉప్పల్‌కు చేరుకుని అడవుల్లో కట్టెలు కొట్టి అమ్మేవాడిని. ఆటో అడ్డాకు చేరా. వాటిని కడగడం.. రాత్రి నేర్చుకోవడం చేసేవాడిని. రూ.80 సంపాదించి లెసైన్స్ తీసుకున్నా. సహకార సంఘంలో ఆటోలు తీసుకుని నడిపాను. సికింద్రాబాద్ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా. ఒకసారి ఎస్సై ఒక కొత్త ఆటోను కారణం లేకుండా కర్రతో కొట్టడంతో టాప్ చినిగిపోయింది. డ్రైవర్ పేదవాడు. నాకు కోపం వచ్చి ఎస్సైని కొట్టాను. అప్పుడు డీసీపీగా ఉన్న అధికారి పిలిచి అడిగారు. విషయం చెబితే సారి చెప్పి పంపించారు. అలా పోలీసులతో పరిచయాలు పెరిగాయి. ఒక పోలీసు అధికారి సహకారంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను.
     
    రియల్ ఎస్టేట్‌తోనే...
     
    సర్వేయర్‌గా పనిచేసి ఉండడంతో  రెవెన్యూ అంశాల్లో పట్టు ఉండేది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనవసరమైన కొర్రీలు పెట్టకుండా పనులు చేసేవాడిని. నా పనితీరును గమనించిన సత్యనారాయణ సోనీ అని ఒక ‘రియల్’ వ్యాపారి నా దగ్గరికి వచ్చి నెలకు రూ.10 వేలు, వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత కమీషన్ ఇస్తానన్నారు. 40 ఎకరాలతో లేఅవుట్ చేశాడు. తర్వాత 90 ఎకరాలతో చేశాడు. లాభం వచ్చింది. నన్ను మోసం చేశాడు. నేనే సొంతంగా మొదలుపెట్టాను. పటాన్‌చెరువు ప్రాంతంలో 10 ఎకరాలతో మొదలుపెట్టాను. అప్పటికే అక్కడ జీవీకే వాళ్లు కొనుగోలు చేశారు. వాళ్లకు మరికొంత భూమి అవసరం ఉండి నన్ను అడిగారు. ఎక్కువ ధర చెప్పాను. దీంతో వాళ్లు నాకు అమ్మిన వాళ్ల దగ్గరికి వెళ్లి నా కంటే ఎక్కువ ధర ఇస్తానన్నారు. దీంతో నేను  జీవీకే వాళ్ల కంటే ముందే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. చివరికి వాళ్లే నా దగ్గర రెట్టింపు ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. అలా మొదట్లోనే  రూ.1.50 లక్షల లాభం వచ్చింది. నేను ఎవరినీ మోసం చేయలేదు. నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం గట్టిగా సమాధానం చెప్పేవాడిని.
     
    కాంగ్రెస్‌తో అరంగేట్రం
     
    రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నప్పుడు తాలూకా వ్యవస్థ ఉండేది. రెవెన్యూ పనులపై వచ్చే ప్రతి వాళ్లకు సహకరించేవాడిని. 1983లోనే అక్కడి వారు నన్ను నన్ను ఎమ్మెల్యే అని పిలిచేవారు. మొదటి నుంచి నేదురుమల్లి జనార్దనరెడ్డికి దగ్గరగా ఉండేవాడిని. 1994లో కాంగ్రెస్ తరపున మేడ్చల్ టికెట్ కోసం ప్రయత్నించా. సీనియర్ అనే కారణంతో వేరేవారికి ఇచ్చారు. 1999లో జిల్లాలో పోటీ చేయాలని అనుకున్నా. 1999లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చిట్టచివరికి ఖరారు చేసిన టికెట్ వర్ధన్నపేటదే. అప్పుడూ నాకు అవకాశం రాలేదు. 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, శివశంకర్ వరంగల్‌లో నిర్వహించిన బీసీ సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సభకు సోనియాగాంధీ వచ్చారు. బహిరంగసభ తర్వాత ఢిల్లీకి వెళ్లినప్పుడు ముత్తిరెడ్డి సహకారంతోనే సభ సక్సెస్ అయిందని సోనియాగాంధీకి వీహెచ్ చెప్పారు. జిల్లా అంతా పలుకుబడి ఉంది కనుక ఎంపీ టికెట్‌కు పరిశీలిద్దామని ఆమె హామీ ఇచ్చారు. కానీ, గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరాను.
     
    మూడో ప్రయత్నంలో...
     
    తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి పార్టీలో క్రీయాశీకలంగా పాల్గొన్నాను. వర్ధన్నపేట నియోజకవర్గంపై దృష్టి పెట్టాను. కాంగ్రెస్‌తో పొత్తులో ఈ సీటు టీఆర్‌ఎస్‌కు వచ్చింది. జిల్లాలోని కొందరు టీఆర్‌ఎస్ నేతల కారణంగా 2004 ఎన్నికల్లో నాకు బీఫారం రాలేదు. టికెట్ దక్కిన మాచర్ల జగన్నాథం వైదొలుగుతానన్నారు. బీసీల టికెట్ తీసుకున్నాననే అపప్రద వద్దని ఊరుకున్నాను. చివరికి నియోజకవర్గ ప్రజల ఒత్తిడితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. నన్ను ఓడించేందుకు అప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతలతో పాటు మా పార్టీలోని కొందరు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సహకరించారు. అయినా గట్టిపోటీ ఇచ్చాను. పోలింగ్‌కు ముందు కేసీఆర్.. నన్ను పార్టీ అభ్యర్థి అని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయాను. తర్వాత పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు ఇచ్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో పాలకుర్తి టికెట్ టీడీపీకి పోయింది. ఆ ఎన్నికల్లో నేను ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయాను. ఎన్నికల తర్వాత జనగామలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పార్టీకి దూరమయ్యారు. కేసీఆర్ నాకు బాధ్యతలు అప్పగించారు. నాలుగున్నరేళ్లు కష్టపడ్డాను. ఇటీవలి ఎన్నికల్లో జనగామ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై విజయం సాధించడంతో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు వచ్చింది. జనగామను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజల సేవ చేయడమే ఇప్పుడు నా లక్ష్యం. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ నన్ను సోదరుడిలా చూసుకుంటున్నారు.
     
    సినిమా రంగంలోనూ ప్రవేశం
     
    వరంగల్‌లో బెంజ్ కారు కొన్న మొదటి వ్యక్తిని నేనే. అంకుశం సినిమా వచ్చాక నాకు కొత్త పేరు వచ్చింది. ఆ సినిమాలో విలన్ రామిరెడ్డికి, నాకు దగ్గరి పోలికలు ఉండడంతో చాలామంది నన్ను రామిరెడ్డిలా ఉన్నావు అనేవారు. ఒకసారి తిరుపతి వెళ్లినప్పుడు నన్ను రామిరెడ్డి అనుకుని ఆటోగ్రాఫ్ అడిగారు. నాకు సినీరంగంలోనూ ప్రవేశం ఉంది. కొన్ని సీరియళ్లలోనూ నటించాను. ఇదే పరిచయంతో సినిమాలో నటించాలని అడిగారు. 1995లో తపస్వి అనే సినిమాలో నేనే నటించి.. నిర్మించాను.  ఎందుకో సినిమా వాతావరణం సరిపడలేదు. ఎన్నికల ప్రచార పాటలను నేనే దగ్గరుండి రాయించాను. నాకు మొదటి నుంచీ వ్యవసాయం అంటే ఇష్టం. రంగారెడ్డి జిల్లా చెంగిచెర్లలో 100 ఎకరాలు ఉండేది. రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పుడు 25 ఎకరాలు మిగిలింది. వ్యవసాయంపై ఇష్టంతోనే ఇక్కడ(జనగామలో) భూమి కొనుగోలు చేసి తోటలు పెట్టాను. గొర్రెలు, ఆవులు ఉన్నాయి. అక్కడ నాకు ఎంతో రిలాక్స్‌గా ఉంటుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement