సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని గ్రామీణ, నగర ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. వృత్తి, కుటుంబం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన తాను ప్రజలకు వీలైనంత ఎక్కువగా సేవ చేయాలనే సదుద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో విశ్వేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
చేవెళ్ల ఎంపీగా గెలిస్తే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నానో అనే అంశంపై ఒక స్పష్టమైన ప్రణాళిక విడుదల చేశారు. తను, తన బృందం మూడేళ్లపాటు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల అవసరాలు తెలుసుకున్న తర్వాతే మేనిఫెస్టో రూపొందించామని చెప్పారు. రైతులు, యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలందరికీ సమ ప్రాధాన్యం కల్పించినట్టు తెలిపారు.
తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని కొండా హామీ ఇచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో లక్ష ఎకరాలకు అదనంగా సాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామానికి రక్షిత తాగునీరు, ఒక టెలీమెడిసిన్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు స్వయం ఉపాధి కోసం సాంకేతిక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
నియోజకవర్గం పరిధిలోకి పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. శంకర్‌పల్లిలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఒక డిగ్రీ కళాశాల, ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ఒక వృద్ధాశ్రమం నెలకొల్పుతామన్నారు. ప్రతి మండలంలో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిస్కారానికి 24 గంటలూ అందుబాటులో ఉంటానని కొండా పేర్కొన్నారు.
ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ధి
ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, తమిళనాడు అందుకు ఉదాహరణ అని కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. భిన్న సంస్కృతుల సమ్మేళనమైన హైదరాబాద్ మహానగరం రానున్న పదేళ్లలో దేశంలోనే అత్యుత్తమ నగరంగా ఎదుగుతుందని, ఐటీఐఆర్, ఇతర పెట్టుబడుల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని అన్నారు.
చంద్రబాబు హయాంలో అటవీ సంరక్షణ పేరిట తెచ్చిన జీఓ 111 జిల్లా అభివృద్ధికి ఆటంకంగా మారిందని, అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో తాను చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
అభివృద్ధే మా నినాదం
Published Wed, Apr 16 2014 11:33 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement