అభివృద్ధే నినాదం | my Slogan of development | Sakshi
Sakshi News home page

అభివృద్ధే నినాదం

Published Sat, Aug 16 2014 2:45 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

అభివృద్ధే నినాదం - Sakshi

అభివృద్ధే నినాదం

‘రాష్ట్ర అవతరణతో మన బాధ్యత మరింత పెరిగింది. సుదీర్ఘ పోరాటాలు.. అమరుల త్యాగాల ఫలితంగా 29వ రాష్ట్రంగా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. కలిసికట్టుగా.. అభివృద్ధే నినాదంగా ముందుకుసాగాల్సిన సమయం ఆసన్నమైంది.. దీనికి ప్రతిఒక్కరం కలిసివద్దాం.. బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుదాం..’
 - ఈటెల రాజేందర్,రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి
 

బంగారు తెలంగాణకు పునరంకితమవుదాం
దసరా నుంచి కొత్త పింఛన్లు    
 పటిష్టంగా పోలీసు వ్యవస్థ
కాకతీయ కెనాల్ సామర్థ్యాన్ని పెంచుతాం
గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్యాకేజీ
సమగ్రంగా కుటుంబ సర్వే    
స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటెల
ముకరంపుర : రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారి జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లాకు వన్నెతెచ్చాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా వందనం చేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 200 మందికి ప్రశంసాపత్రాలు అందించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. దళితులకు పట్టాలు అందించి మొదటివిడత భూ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం మాట్లాడారు. ఆయన మాటల్లోనే..
 
రాష్ట్రం గ్రామ స్థాయిలో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాకు రూ.5.424కోట్లతో 7,444 పనులను గుర్తించాం. వాటికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం. నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నాం. నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంపిక చేసి అందులో గుర్తించిన లబ్ధిదారులకు భూమి ఇస్తాం. ఇందుకు ప్రభుత్వం రూ.ఐదు కోట్లు విడుదల చేసింది.
 
రుణమాఫీతో ఐదు లక్షల మందికి లబ్ధి

పంటరుణాలు మాఫీ చేయడం ద్వారా జిల్లాలో ఐదు లక్షలమందికి లబ్ధి చేకూరనుంది. దసరా నుంచి కొత్త పింఛన్లు ఇస్తాం. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ అందిస్తాం. దళిత, గిరిజన కుటుంబాల్లో పుట్టిన అమ్మాయిల పెళ్లి ఖర్చులకు ‘కళ్యాణలక్ష్మి’ పథకం కింద రూ.50 వేల చొప్పున అందిస్తాం. గిరిజనతండాలను, గూడాలను పంచాయతీలుగా మారుస్తాం.
 
అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు
1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తాం. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలు, ఆటోలకు రవాణా పన్నును రద్దు చేశాం.
 
గల్ఫ్ బాధితులకు కేరళ తరహా ప్యాకేజీ
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి తిరిగొచ్చిన వారిని ఆదుకునేందుకు కేరళ తరహా ప్యాకేజీ అమలు చేస్తాం. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కోసం కమిషన్ ఏర్పాటు చేశాం. మైనార్టీ కమిషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. ఆర్థిక స్థోమత లేక విద్యార్థులు చదువులకు దూరం కావద్దనే లక్ష్యంతో ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చాం.
 
కరీంనగర్ చుట్టూ రింగురోడ్డు
కరీంనగర్ నగరం చుట్టూ రింగురోడ్డు, నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేస్తాం. జిల్లా పోలీస్ విభాగానికి అత్యాధునిక వాహనాలను అందించి వ్యవస్థను పటిష్టం చేస్తాం. రామగుండంలో ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నాం. సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెడికల్ కాలేజీ, అనుబంధంగా ఆధునాత ఆసుపత్రిని నిర్మిస్తాం. అక్కడే మైనింగ్ పాలిటెక్నిక్ ఏర్పాటు, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం.జిల్లాకేంద్ర ఆసుపత్రిని నిమ్స్‌స్థాయిలో అభివృద్ధి చేస్తాం. మంథని ఆసుపత్రిని వంద పడకలు, హుస్నాబాద్ ఆసుపత్రిని 50 పడకల స్థాయికి పెంచుతాం. అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రభుత్వం తరఫున సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించాం.
 
కాకతీయ కెనాల్ సామర్థ్యం పెంచుతాం
కాకతీయ కెనాల్ నీటి సామర్థ్యాన్ని 12వేల నుంచి 14 వేల క్యూసెక్కులకు పెంచుతాం. ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు మధ్య మరో జలాశయం నిర్మిస్తాం. రాయికల్- బోర్నపల్లి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మిస్తాం. ఏడు కొత్త వ్యవసాయ మార్కెట్‌లు ప్రారంభిస్తాం. బతుకమ్మ నిమజ్జనం కోసం మానకొండూర్ చెరువును అభివృద్ధి చేస్తాం. కొండగట్టును ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు 300 ఎకరాల స్థలాన్ని గుర్తిస్తాం. హుజురాబాద్‌ను కొత్త డివిజన్‌గా ఏర్పాటు చేసి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాం. రామగుండం పట్టణానికి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీరందిస్తాం.
 
ఇంటి సర్వే ముఖ్యం
ఈ నెల 19న నిర్వహించనున్న ఇంటింటి సర్వే చాలా ముఖ్యమైనది. అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందించేందుకు ఈ సర్వే దోహదపడుతుంది. ఆరోజు సెలవు ప్రకటించినందున ప్రజలు ఇంటివద్దనే ఉండి ఎన్యుమరేటర్లకు సమాచారం అందించాలి.
 
ప్రాజెక్టుల పూర్తికి చర్యలు

అసంపూర్తిగా ఉన్న మధ్యమానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేస్తాం. గొలుసు కట్టు చెరువులను అభివృద్ధి చేసి జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీరందిస్తాం. అదే సమయంలో తాగునీటికి కొరత లేకుండా చూస్తాం. తాగునీటి సమస్య పరిష్కారానికి అన్ని పథకాలను సమన్వయం చేసి 160 టీఎంసీలతో గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నాం.
 
యంత్ర పరికరాలకు సబ్సిడీ
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందించేందుకు జిల్లాకు రూ.18.60 కోట్ల మంజూరు చేశాం. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు బిందు, స్ప్రింక్లర్ల సేద్యానికి ప్రాధాన్యత నివ్వాలి. ఈ ఏడాది జిల్లాలో 3500 హెక్టార్లలో బిందు సేద్యం, 1208 హెక్టార్లలో తుంపర్ల సేద్యం లక్ష్యంగా పెట్టుకున్నాం.  కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, బొడిగే శోభ, కొప్పుల ఈశ్వర్, చెన్నమనేని రమేశ్‌బాబు, పుట్ట మధు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, ఇన్‌చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఐజీ నాయక్, ఎస్పీ శివకుమార్ , అదనపు ఎస్పీ జనార్దన్, డీఎస్పీ రవీందర్, ఏజేసీ నంబయ్య, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement