
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల అనంతరం విస్తారంగా కురిసిన వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటే నాగార్జునసాగర్ మాత్రం నీటిలోటుతో అల్లాడుతోంది. మంచి వర్షాలు కురిసిన ప్రస్తుత సీజన్‌లోనూ సాగర్‌లో 41.42 టీఎంసీల నీటి కొరత ఉంది. ‘నైరుతీ’కాలం ముగియడంతో ఎగువ రాష్ట్రాల నుంచి ప్రవాహాలు వస్తాయన్న ఆశలు అడుగంటాయి. దీంతో ఇక ఆశలన్నీ నవంబర్‌లో వచ్చే తుపాన్‌లపైనే ఉన్నాయి.
నవంబర్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్‌ల ప్రభావం కృష్ణా బేసిన్‌పై ఎక్కువగా ఉంటుందని, వాటి ద్వారా ప్రాజెక్టుల్లోకి ఆశించిన నీరొస్తుందని భావిస్తున్నామని, లేదంటే మున్ముందు నీళ్ల కష్టాలు తప్పవని నీటి పారుదల వర్గాలంటున్నాయి. ఈ ఏడాది ఎగువన కురిసిన వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నెలన్నర కిందటే పూర్తి మట్టాలకు చేరుకున్నాయి. 25 రోజుల కిందట శ్రీశైలం ప్రాజెక్టు నిండింది.
అక్కడి నుంచి నీటి విడుదల కొనసాగడంతో 312.05 టీఎంసీల సామర్థ్యమున్న సాగర్‌లో నిల్వలు 270.62 టీఎంసీలకు చేరాయి. వారం రోజుల నుంచి ప్రవాహాలు క్షీణించాయి. ఆదివారం నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి 18 వేల క్యూసెక్కుల మేర ఔట్‌ఫ్లో ఉన్నా, అందులో 11 వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడుకు.. మిగతా నీరు కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ అవసరాలకు మళ్లిస్తున్నారు. దీంతో దిగువకు చుక్క రావడం లేదు. ఈ నేపథ్యంలో నవంబర్‌లో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్‌ల పైనే సాగర్ పరిస్థితి ఆధారపడి ఉంది.
గతంలో తుపాన్‌ల నీటితోనే..
నవంబర్‌లో బంగాళాఖాతంలో వచ్చే తుపాన్‌ల ప్రభావం నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. గతంలో తుపాన్‌ల సమయంలో సాగర్‌లోకి నీరు రావడంతోనే జంట నగరాలు, కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు ఇబ్బంది తలెత్తలేదని నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు. ఒక్కోమారు నవంబర్ చివర, డిసెంబర్‌లోనూ కృష్ణా బేసిన్‌లో కొద్దిపాటి వర్షాలు ఉంటాయని, అవి ఆశించిన మేర కురిస్తే ప్రయోజనకరమని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment