కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు... మహాపురుషులవుతారు.. అన్నాడో సినీ కవి.. దానిని నిజం చేశాడు చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన మహ్మద్ గోరేమియా. నేటి సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలంటే చదువు, ఉద్యోగం, రాజకీయం, డబ్బు ఇలాంటి అంశాల్లో తమ ఉంటేనే ప్రత్యేకతను చాటుకుంటారు. పై అంశాలు ఏమీ తన వద్ద లేకున్నా తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చాటుకున్నాడో సాధారణ మెకానిక్. తాను చదివింది కేవలం 9వ తరగతే అయినా పనికిరాని పాత సామగ్రితో నూతన యంత్రాల ఆవిష్కరణలు చేస్తున్నాడు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి తోడుగా ఉండాలని నిరంతరం ఏదో ఒక యంత్రం, పనిముట్లు సాధారణ ధరల్లోనే తయారు చేస్తూ ఓరా అనిపిస్తున్నాడు. గ్రామీణ ఇంజనీర్‌గా పిలువబడుతున్న మహ్మద్ గోరేమియాపై ప్రత్యేక కథనం.
సాక్షి చౌటుప్పల్(నల్గొండ): చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన గోరేమియా కుటుంబం చాలా సంవత్సరాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో నివాసం ఉంది. గోరేమియా తండ్రి వ్యవసాయశాఖలో ఉద్యోగం చేస్తుండగా ఆ రాష్ట్రానికి బదిలీ కావడంతో అక్కడకు వెళ్లారు. సుమారు 18ఏళ్ల క్రితం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. తన ముగ్గురు సోదరుల్లో అందరూ మెకానిక్ వృత్తిలోనే ఉన్నారు. సోదరులంతా హైదరాబాద్‌లో ఉంటుండగా గోరేమియా తన భార్యాపిల్లలతో లక్కారంలోనే నివాసం ఉంటున్నాడు.
వినూత్నంగా యంత్రాలు, పనిముట్ల తయారీ..
జీవనోపాధి కోసం మెకానిక్‌గా ఉన్నప్పటికీ అందులో తనకు తృష్తి లేకపోవడంతో ఇంకా ఏదో సాధించాలని తపించేవాడు. అందులో భాగంగా వ్యవసాయ రంగంలో వినియోగించే యంత్రాలు, పనిముట్లు తయారు చేయాలని భావించాడు. ఆ క్రమంలో పొలం దున్నేందుకు, కలుపు తీసేందుకుగాను మినీ ట్రాక్టర్లు, మెట్ట పంటలకుగాను బైక్‌తోగుంటుక, కూరగాయల సాగులో కలుపు తీసేందుకు యంత్రాలు, వరి, గడ్డి కోసేందుకు కోత మిషన్లు, దూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకువచ్చేందుకు వినూత్న మోటార్లు తయారు చేశాడు. చాలా లోతులో ఉన్న బోరుబావుల్లో మోటార్లు చెడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు బయటకు తీసేందుకు ప్రత్యేక యంత్రం, తోటల్లో మొక్కలు నాటేందుకుగాను గుంతలు తీసేందుకు, స్తంభాలు నిలబెట్టేందుకుగాను ప్రత్యేక పరికరాన్ని రూపొందించాడు. ప్రస్తుతం మ్యాగ్నటిక్‌తో పని చేయించే పనిలో ఉన్నాడు.
ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు..
గోరేమియా రూపొందించిన నూతన యంత్రాలు, పని ముట్లకు స్థానిక గ్రామాలతోపాటు వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. ధర తక్కువ ఉండడం, పని తీరు, సామర్థ్యం మార్కెట్లో లభించే యంత్రాలతో సమానంగా ఉండడంతో రైతులు కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రంగారెడ్డి, వరంగల్, మెదక్, హైదరాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు జిల్లాలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సైతం తన యంత్రాలను ఎగుమతి చేస్తుంటాడు. రైతులు ముందస్తుగా ఆర్డర్ ఇవ్వకపోకపోయినా, తన వద్ద స్టాక్ ఉండేలా చూసుకుంటున్నాడు.
దూర ప్రాంతాలకు నీటిని తరలించేందుకు ఎయిర్‌కూల్డ్ ఇంజన్..
రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరు, బావి, కాలువలు, చెరువుల నుంచి నీటిని ఇతర మార్గాల ద్వారా తమ వ్యవసాయ పొలాల వద్దకు తరలించాలంటే రైతులకు చాలా ఇబ్బందే. అలాంటి రైతుల కోసం ఎయిర్‌కూల్డ్ మోటారును తయారు చేశాడు. దీనిని రేడియేటర్ లేకుండా రూపొందించాడు. ఇది డీజిల్, కిరోసిన్‌తో నడుస్తుంది. ఒక లీటరు గంటన్నర సమయానికి పని చేస్తుంది. ఈ యంత్రం బహిరంగ మార్కెట్లో రూ. 20–25వేల వరకు విక్రయిస్తుండగా ఇతను రూ. 10వేలకే విక్రయిస్తున్నాడు.
తక్కువ ధరలకే గడ్డికోత యంత్రాలు..
రైతులకు అందుబాటులో ఉండే విధంగా వరి, పశువుల గడ్డి కోత యంత్రాన్ని తయారు చేశాడు. ఒకే యంత్రం రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఈ సెట్ షోరూంలల్లో రూ. 60వేలు ఉండగా ఇతను రూ. 18వేలల్లో రైతులకు అందుబాటులో ఉంచాడు. ఎకరన్నర పొలంలోని గడ్డిని గంట సేపట్లో కోస్తుంది.
పొలం దున్నేందుకు మినీ ట్రాక్టర్..
చిన్న, సన్నకారు రైతుల కోసం మినీట్రాక్టర్‌ను తయారు చేశాడు. భారీ వాహనాలు నడిపిన అనుభవం లేని వ్యక్తులు సైతం దీన్ని నడుపవచ్చు. బురద, మెట్టు పొలాల్లో పని చేస్తుంది. బురదలో అలాయ్‌వీల్స్ వేయాల్సి ఉంటుంది. ఇదే ట్రాక్టర్ ద్వారా తోటలు, కూరగాయల సా గుల్లో మందు రసాయనాలు స్ప్రే చేయవచ్చు.
ద్విచక్రవాహనంతో గుంటుక యంత్రం
మెట్టపంటల్లో కలుపు తీసేందుకు ద్విచక్రవాహనంతో సరికొత్తగా గుంటుకను తయారు చేశాడు. తన వద్ద ఉన్న వాహనానికి గుంటుకను అమర్చాడు. లీటరు డీజిల్‌తో సుమారు రెండు గంటలసేపు పని చేస్తుంది. ఇది రూ. 40వేలకే అందిస్తున్నాడు.
వినూత్న పరికరాల తయారీ నేర్చుకున్న
ఎనిమిదేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నా. వినూత్న యంత్రాలు, పనిముట్ల తయారీ నేర్చుకున్నా. ఇక్కడ తయారయ్యే యంత్ర సామగ్రిని ఎంతో మంది మెచ్చుకుంటారు. రైతులు ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తుంటారు. – కరంటోతు కృష్ణ, చిల్లాపురం
ప్రభుత్వం ప్రోత్సహించాలి
వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే రైతాంగం కోసం ఏదో చేయాలని అనుకున్నా. అందులో భా గంగానే ఇవన్నీ తయారు చేస్తున్నా. ప్రభుత్వం రైతులకు ప్రతి కొనుగోలుపై సబ్సిడీ అందివ్వాలి. నా లాంటి వారిని ప్రోత్సహించాలి. – గోరేమియా, యంత్రాల తయారీదారుడు
Comments
Please login to add a commentAdd a comment