
పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్న యూనియన్ మహిళా ఉద్యోగులు
శ్రీకాకుళం అర్బన్ : దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకుల జాతీయీకరణ ఎంతగానో తోడ్పాటునందించిందని ఆలిండియా ఆంధ్రాబ్యాంక్ అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ కమిటీ సభ్యురాలు జి.కరుణ అన్నారు. బ్యాంకులను జాతీయీకరణ చేసి 50 ఏళ్లవుతున్న సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళంలోని ఆంధ్రాబ్యాంక్ ఆర్‌సీబీ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం నాటికి 648 వాణిజ్య బ్యాంకులు పూర్తిగా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవని, స్వాతంత్య్రానంతరం రెండు దశాబ్దాల్లో(1948–1968) దాదాపు 300కు పైగా బ్యాంకులు మూతపడ్డాయన్నారు. 1969 జూలై 19న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా దేశంలోని 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయీకరణ చేశారని గుర్తు చేశారు. 1980 ఏప్రిల్ 15న మరో ఆరు బ్యాంకులను జాతీయీకరణ చేశారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ అసిస్టెంట్ ఉమెన్ కన్వీనర్ వీఎస్‌ఆర్ సౌమ్య మాట్లాడుతూ దేశ ప్రజల నగదుకు భద్రత బ్యాంకులేనని అన్నారు. సామాజిక సంక్షేమానికి, బ్యాంకింగ్ వ్యవస్థను, గ్రామీణ ప్రాంతాలకు విçస్తృత పరచడానికి, ప్రాధాన్యతా రంగాలకు రుణ వితరణ ద్వారా ఆర్థిక స్వావలంబన, ప్రజల్లో బ్యాంకుల ద్వారా ఆర్థిక అవగాహన కల్పించడాని జాతీయీకరణ దోహదపడిందన్నారు. కార్యక్రమంలో యూనియన్ మహిళా ప్రతినిధులు స్వాతి, దివ్య, ప్రతిభ, మానస, సౌజన్య, మాధవీలత, శాంతకుమారి, స్వర్ణశ్రీ, శ్రీలక్ష్మి, మహిళా ఖాతాదారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment