
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నోటిఫికేషన్ జారీచేసింది. 2020–21 వైద్య విద్యాసంవత్సరానికి గానూ వచ్చే ఏడాది మే 3న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తులను nta.ac.in లేదా ntaneet.nic.in వెబ్‌సైట్లలో పొందవచ్చు. దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక దరఖాస్తు మాత్రమే సమర్పించాలి. రుసుము చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫారం ఒక్కోసారి రద్దయిపోతే, చెల్లించిన రుసుం తిరిగి వెనక్కు వస్తుంది.