చందానగర్: మహిళా సాధికారతతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పలువురు మహిళలు అభిప్రాయపడ్డారు. చందానగర్ జనప్రియ 9 వ్యాలీలో శుక్రవారం ‘సాక్షి టీవీ’ ఆధ్వర్యంలో ‘నేను శక్తి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మన దేశంలో 99 శాతం మంది మహిళలు ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బయటకు రావాలి..
సమాజంలో ప్రతి చోట మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు బయటకొచ్చి తమ బాధలు చెప్పుకోవాలి. అందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. – సుజాత త్రిపాఠి
చర్చ జరగాలి..
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలి. ఇంట్లో, బయట ఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలామంది తమ సమస్యలను బయటకు చెప్పుకోవడం లేదు. దీంతో ఒత్తిడికి గురై అనారోగ్యం పాలవుతున్నారు. – పూనం పారిక్
చైతన్యం వస్తుంది..
ఇలాంటి కార్యక్రమాలతో మహిళల్లో చైతన్యం వస్తుంది. సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. వాటిని అధిగమించి నవ సమాజ నిర్మాణం కోసం పోరాడతారు. – మృణాల్
అభినందనీయం..
అందరూ మనకెందుకులే అని ఊర్కొంటే మహిళల్లో చైతన్యం రాదు. వేధింపులకు గురవుతున్న సమాజంలో కుటుంబ పరువు పోతుందనే భయంతో ఎందరో నిశ్శబ్దంగా బతుకుతున్నారు. ‘సాక్షి’ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. – జయశ్రీ
ప్రశ్నించాలి..
వేధింపులకు తలవంచకుండా ప్రతి మహిళ ప్రశ్నించాలి. అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా ఎదగాలి. అప్పుడే మహిళా శక్తి ప్రపంచానికి తెలుస్తుంది. – రజిని
ఈ కార్యక్రమం నేడు ఉదయం 10గంటలకు ‘సాక్షి టీవీ’లో ప్రసారమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment