ప్లేటు..సీటు! | New Facilities For GHMC 5rs meals Scheme In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్లేటు..సీటు!

Published Wed, Jul 18 2018 11:09 AM | Last Updated on Tue, Sep 4 2018 5:53 PM

New Facilities For GHMC 5rs meals Scheme In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ప్రతినిత్యం దాదాపు 35 వేల మంది క్షుద్బాధ తీరుస్తున్న రూ.5 భోజన(అన్నపూర్ణ) కేంద్రాలకు అదనపు హంగులు కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. ప్రస్తుతం ఏకరూప నమూనాలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లోకి వచ్చేవారు పైకప్పు కూడా లేకుండానే నిల్చుని భోజనం చేయాల్సిన పరిస్థితి. ఈ కేంద్రాలకు వచ్చేవారి గౌరవానికి భంగం కలగకుండా.. తగిన సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దాలని భావించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. ప్రస్తుతంఏర్పాటు చేసిన ఈ కేంద్రాలకు ఒక్కో దానికి రూ.3.6 లక్షలు ఖర్చు కాగా, అదనపుసదుపాయాలకు దాదాపు రూ.3 లక్షలు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతమున్న 150 అన్నపూర్ణ కేంద్రాల్లో తగిన స్థల సదుపాయం ఉన్న కేంద్రాల్లో కొత్త సదుపాయాలు  అందుబాటులోకి తేనున్నారు.

దాదాపు వంద చ.మీ.ల స్థలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వర్షానికి తడవకుండా ఉండేందుకు పైన కప్పులాంటి ఏర్పాటుతోపాటు  నగరంలోని పలు ప్రాంతాల్లో  సెల్ఫ్‌సర్వీస్‌ విధానంలో ఉన్న సందర్శిని టిఫిన్‌ కేంద్రాల తరహాలో స్టాండ్‌తో కూడిన స్టీల్‌ రౌండ్‌ టేబుళ్లు, మరికొందరు కూర్చునేందుకు కుర్చీ, బల్లలు వంటివి ఏర్పాటు చేయనున్నట్లు మేయర్‌ పేర్కొన్నారు. మొత్తం ఎన్ని కేంద్రాల్లో ఈ ఏర్పాట్లకు అవకాశముందో పరిశీలించి, తగిన ప్రతిపాదనలు రూపొందించి త్వరలోనే ఈ సదుపాయాలు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఈ ఏర్పాట్లతో ఏకకాలంలో దాదాపు ఇరవైమందికి ఈ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. గడచిన నాలుగేళ్లుగా ఎంతో ఆదరణ పొందిన ఈ పథకం రాష్ట్రంలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ గుర్తింపు పొందింది. హైదరాబాద్‌ స్ఫూర్తితో కొన్ని నగరాల్లో వివిధ పేర్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇతర నగరాలకు ఆదర్శప్రాయంగా మారిన దీన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సదుపాయాలపై దృష్టి సారించారు. 

కోటిమందికి పైగా..
నగరంలో నాలుగేళ్లక్రితం ప్రారంభమైన ఈ  పథకం  ఇప్పటి వరకు కోటిమందికి పైగా ఆకలిబాధను తీర్చింది. 2014 మార్చి 2వ తేదీన నాంపల్లి సరాయి వద్ద లాంఛనంగా ప్రారంభమైన ఇది తొలుత ఎనిమిది కేంద్రాలతో ప్రారంభమై దశలవారీగా 150 కేంద్రాలకు చేరింది. హరే కృష్ణ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న ఈ భోజన పథకంలో భాగంగా నాణ్యత, వేడితో కూడిన భోజనాన్ని ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందిస్తున్నారు.

ఈ పథకంలో అందిస్తున్న భోజనానికి రూ.24.25 ఖర్చవుతుండగా, రూ.5లను మాత్రమే లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్నారు. మిగతా రూ.19.25 లను జీహెచ్‌ఎంసీ సబ్సిడీగా అందజేస్తోంది. రుచి, శుచి, నాణ్యతలో లోపాల్లేకపోవడంతో ప్రజలెందరో ఈ భోజనం కోసం క్యూలో నిల్చుంటున్నారు. ముఖ్యంగా ఆటో కార్మి కులు, వివిధ పనులు చేసే దినవారీ కూలీలు, ఆయా అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు, ఆస్పత్రుల్లోని వారికి సహాయకులుగా వచ్చేవారు, పోటీ పరీక్షల కోసం నగరానికి శిక్షణకు వచ్చిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. నగరంలో సాధారణ హోటల్‌లో భోజనానికి దాదాపు రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోండగా, రూ.5లకే అందుతున్న ఈ భోజనానికి విశేషంగా స్పందన లభిస్తోంది. 

ఇదీ మెనూ..  
400 గ్రాముల రైస్, 100 గ్రాముల పప్పు, 100 గ్రాముల కూర, సాంబార్, స్పూన్‌పచ్చడి.

ఎందరికో ప్రయోజనం..
సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీలతో పాటు భారీ సంఖ్యలో కోచింగ్‌ కేంద్రాలున్న అమీర్‌పేట  లాంటి ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన అన్నపూర్ణ క్యాంటీన్‌లను నిరుద్యోగ యువతీ యువకులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నారు. వీరితో పాటు వివిధ హాస్టళ్లలో ఉంటున్న నిరుద్యోగులకు సైతం ఈ అన్నపూర్ణ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement