యాప్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో జయేశ్‌రంజన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్‌పై సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘టీ కోవిడ్–19’యాప్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఆవిష్కరించారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజారోగ్య వ్యవస్థకు సవాలుగా నిలుస్తోందన్నారు. ఈ సవాలును ఎదుర్కోవడంలో ప్రజలు, ప్రభుత్వానికి ఉపకరించేలా ఏడబ్ల్యూఎస్, సిస్కోతో పాటు హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ క్వాంటెలా సహకారంతో రాష్ట్ర ఆరోగ్య, ఐటీ మంత్రిత్వ శాఖలు ‘టీ కోవిడ్–19’యాప్‌ను రూపొందించాయని తెలిపారు. ఈ యాప్ ద్వారా కోవిడ్–19కు సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
అనవసరమైన భయాందోళనకు గురి కాకుండా పౌరులు తమ ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. కాల్ హెల్త్ అనే టెలీమెడిసిన్ మాడ్యూల్‌తో ఈ యాప్‌ను అనుసంధానం చేయడంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారు కూడా వైద్యులతో సంప్రదింపులు జరపవచ్చని వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, మీడియా బులెటిన్లు, ప్రభుత్వ ప్రకటనలు, ఇతర అత్యవసర సేవలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయని కేటీఆర్ వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర ప్రపంచ స్థాయి ఆరోగ్య సంస్థలు ఇచ్చిన సలహాలు, సూచనలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఆల్ ఇన్ వన్ తరహాలో కోవిడ్‌కు సంబంధించి పౌరులకు అవసరమైన సమాచారం ఈ యాప్‌లో అందుబాటులో ఉంటుందని క్వాంటెలా వ్యవస్థాపకులు శ్రీధర్ గాంధీ వెల్లడించారు.
కలిసికట్టుగా సంక్షోభాన్ని ఎదుర్కొందాం
కరోనా సంక్షోభం నుంచి ప్రపంచం త్వరలో గట్టెక్కుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ శాఖకు చెందిన సుమారు 100 మంది వ్యాపారవేత్తలతో ఆయన శనివారం భేటీ అయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధింపు తదితర పరిణామాలపై మంత్రి వివరిస్తూ, నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి చెప్పారు. లాక్‌డౌన్‌తో లక్షలాది మంది జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, వ్యాధిని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని తెలిపారు. లాక్‌డౌన్ మూలంగా వ్యాపార, వాణిజ్య వర్గాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రం సంప్రదింపులు జరుపుతోందన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ అభినందించింది.
Comments
Please login to add a commentAdd a comment