తెయూ పరిపాలనా భవనం
సాక్షి, తెయూ(నిజామాబాద్) : తెలంగాణ యూనివర్సిటీకి త్వరలో కొత్త వైస్ చాన్సలర్ రానున్నారు. రెండు, మూడు వారాల్లో నియమితులయ్యే అవకాశముంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీల నియామకంపై సీఎం కేసీఆర్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖాళీగా ఉన్న వీసీల నియామకాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ముందుగా సెర్చ్ కమిటీల నుంచి పేర్లు తెప్పించుకుని ఆయా వర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ల (ఈసీ) నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. రెండు, మూడు వారాల్లోనే వీసీల నియామక ప్రక్రియ పూర్తి చేసి అన్ని వర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని సీఎం ఆదేశించడంతో తెలంగాణ యూనివర్సిటీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
త్వరలో భేటీ కానున్న సెర్చ్ కమిటీ..
వీసీల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీల వారీగా రెండు నెలల క్రితమే సెర్చ్ కమిటీలను నియమించింది. తెయూ ఈసీ నామినీగా ప్రొఫెసర్ వీఎస్ ప్రసాద్ (అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ), యూజీసీ నామినీగా ప్రొఫెసర్ అప్పారావ్ (హైదరాబాద్ యూనివర్సిటీ వీసీ), రాష్ట్ర ప్రభుత్వ నామినీగా సోమేశ్‌కుమార్ (ప్రస్తుత చీఫ్ సెక్రెటరీ) నియమితులయ్యారు. అయితే, ఇంతవరకు సెర్చ్ కమిటీ సమావేశం జరగలేదు. దీంతో వీసీ నియామక ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అయితే, తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెర్చ్ కమిటీ రెండు, మూడ్రోజుల్లో భేటీ అయ్యే అవకాశముంది.
వీసీ పదవికి తీవ్రమైన పోటీ..
తెయూ వీసీ పోస్టుకు ఈసారి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ తర్వాత మూడో పెద్ద వర్సిటీగా తెలంగాణ యూనివర్సిటీ పేరు గాంచింది. వీసీల నియామకాల్లో సామాజిక సమతూకాన్ని పాటిస్తారు. తెయూ తొలి రెగ్యులర్ వీసీగా ప్రొఫెసర్ కాశీరాం, రెండో వీసీగా ప్రొఫెసర్ అక్బర్‌అలీఖాన్, మూడవ రెగ్యులర్ వీసీగా ప్రొఫెసర్ సాంబయ్య పని చేశారు. ఒకరు ఓసీ, మరొకరు మైనారిటీ, ఇంకొకరు దళిత సామా జిక వర్గానికి చెందిన విద్యావేత్తలు ఇప్పటివరకు తెయూ రెగ్యులర్ వీసీలుగా పని చేశారు. ఇక నాలుగో రెగ్యులర్ వీసీగా ఎవరు వస్తారనేది రెండు, మూడు వారాల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment