సాక్షి, హైదరాబాద్: రజక వృత్తికి ఆధునిక సొబగులు అద్దుతోంది రజక ఫెడరేషన్. చెరువులు, వాగుల వద్ద బట్టలుతికే పద్ధతికి స్వస్తి పలికేందుకు ఫెడరేషన్ చర్యలు చేపట్టింది. వృత్తిని ఆధునీకరించేందుకు నడుంబిగించింది. మోడ ల్ వాషింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చెరువులు, వాగుల్లో నీటి లభ్యత లేకపోవడం, కొన్నిచోట్ల అపరిశుభ్రమైన నీటితో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వృత్తికి సాంకేతికతను జోడిస్తోంది.
ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో మోడల్ వాషింగ్ యూనిట్లు ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. ఫెడరేషన్ పరిధిలోని సంఘాల్లో సభ్యత్వం ఉన్న రజకులకు తక్కు వ ధరలో బట్టలుతికి ఆరబెట్టి ఇచ్చే వాషింగ్ మిషన్లను తీసుకురానుంది. రజకులకు శ్రమ తగ్గించి వృత్తిని విస్తృత పర్చుకునే వెసులుబా టు కల్పించాలని రజక ఫెడరేషన్ భావిస్తోంది.
ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా..
మోడల్ వాషింగ్ యూనిట్లను తొలుత ఐదు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాల ని ఫెడరేషన్ నిర్ణయించింది. రజకుల జనాభా అధికంగా ఉన్న ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట్, నల్లగొండ జిల్లాలను ఎంపిక చేసింది. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు రూ.40 లక్షల వరకు వెచ్చించనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది.
వాటికి ఆమోదం లభిస్తే క్షేత్రస్థాయిలో చర్యలు వేగవంతం చేయనుంది. రజకులు ఇళ్ల నుంచి సేకరించే వస్త్రాలను చెరువులు, వాగులు వద్ద ఉతకడంతోపాటు అక్కడే ఆరబెట్టేవారు. దీనికిగాను ఒకరిద్దరు సహాయకులను నియమించుకునేవారు. మోడల్ వాషింగ్ యూనిట్లతో ఈ కష్టాలన్నీ దూరమ య్యే అవకాశముంది. ఆయా ప్రాజెక్టుల పరిధుల్లో రజకులు సేకరించిన వస్త్రాలను నేరుగా యూనిట్‌లో సమర్పించాలి.
యూనిట్ నిర్వహకులు వాటిని నిర్ణీత గడువులోగా ఉతికి, ఆరబెడతారు. ఆ తర్వాత ఎవరి వస్త్రాలను వారు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఉతికి, ఆరబెట్టినందుకు ప్రతిఫలంగా ఫీజు ఇవ్వాలి. ఈ ఫీజు మొత్తాన్ని రజక ఫెడరేషన్ నిర్ణయిస్తుంది. ఉతికి, ఆరబెట్టిన వస్త్రాలను రజకులు ఇంటి వద్ద ఇస్త్రీ చేసి కస్టమర్లకు అందజేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment