అప్‌డేట్ అవ్వండయా! | NIC department in iterations | Sakshi
Sakshi News home page

అప్‌డేట్ అవ్వండయా!

Published Sat, Apr 4 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:48 PM

NIC department in iterations

కొత్త సమాచారం కరువు
ఉప ముఖ్యమంత్రికి దక్కని చోటు
ఎంపీ, ఎమ్మెల్యేలదీ ఇదే పరిస్థితి
తెలంగాణ రాష్ట్రం ప్రస్తావనే లేదు
నిద్రావస్థలో ఎన్‌ఐసీ విభాగం
పట్టించుకోని కలెక్టర్ కరుణ

 
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రపంచం మారిపోతోంది. ఇప్పుడు అంతా టెక్నాలజీ మయమే. ఏది తెలుసుకోవాలన్నా.. చూడాలన్నా అన్ని కంప్యూటర్‌తోనే. ప్రభుత్వాలు ఇప్పుడు ఇదే పంథాలో వెళ్తున్నాయి. రేషన్‌కార్డు, పింఛన్లు, స్కాలర్‌షిప్, ఓటరు నమోదు నుంచి గ్యాస్ బుకింగ్ వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే. కొత్త టెక్నాలజీ ప్రకారం మారుతున్న విధానాలకు అనుగుణంగా ప్రజలు సాంకేతిక అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచిస్తున్నారు. అధికారులు మరో ముందడుగు వేసి అన్ని ఆన్‌లైన్‌లోనే ఉన్నాయని చెబుతున్నారు.

ప్రభుత్వ భూములు, ఫిర్యాదులు, పిటిషన్లు, తాజాగా ఓటరు నమోదుతో ఆధార్ కార్డు అనుసంధానం అంతా ఇంటర్నెట్‌లోనే జరుగుతుందంటున్నారు. దీనికోసం ప్రజలు సిద్ధం కావాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. ఇలా ప్రజలకు సూచనలు ఇస్తున్న జిల్లా అధికార యంత్రాంగం.. ఈ విషయంలో అప్‌డేట్ కావడం లేదు. అధికారులు సాంకేతికంగా ముందుకు కదలడంలేదని చెప్పడానికి అధికారిక వెబ్‌సైట్ సాక్షిగా నిలుస్తోంది.

జిల్లా సమాచారం లేదు..

ప్రభుత్వ పరంగా ప్రతి జిల్లాకు ఒక అధికారిక వెబ్‌సైట్ ఉంటుంది. మన జిల్లాకు ఠీఠీఠీ.ఠ్చీట్చజ్చ.జీఛి.జీ వెబ్‌సైట్ ఉంది. జిల్లాకు సంబంధించిన ప్రతి అంశం ఇందులో ఉండాలనే ఉద్దేశంతో వెబ్‌సైట్‌ను రూపొందించారు. జిల్లా యంత్రాంగం ఇచ్చే సమాచారంతో జాతీయ సాంకేతిక కేంద్రం(ఎన్‌ఐసీ) జిల్లా విభాగం వారు ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తుంటారు. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా వెబ్‌సైట్ తీరు అధ్వానంగా ఉంది. జిల్లాకు సంబంధించిన కొత్త సమాచారం అనేదే కనిపించడంలేదు. ఎప్పుడో ఏళ్లనాటి సమాచారమే ఉంది. జిల్లాకు ఉండే అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త విషయాలు ఏవీ ఉండవు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పది నెలలు గడిచినా కొత్త రాష్ట్రం గురించి ప్రస్తావనే లేదు. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలిచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన వారు పేర్లు, ఫొటోలు జిల్లా వెబ్‌సైట్‌లో దర్శనమివ్వడం లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత కీలకమైన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు, ఫొటో జిల్లా వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు.

గత సమాచారమే దిక్కు

కొత్త ప్రజాప్రతినిధుల సమాచారం నమోదు చేయకపోగా గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారి వివరాలు ఉన్నారుు. వీటిని ఇటీవలే తొలగించారు. ఇలాంటి ప్రాథమిక అంశాలతోపాటు జిల్లాకు సంబంధించిన కొత్త సమచారం ఏదీ వెబ్‌సైట్‌లో ఉండడం లేదు. జిల్లా యంత్రాంగం సమాచా రం ఇవ్వనిదే తాము కొత్త సమాచారం చేర్చలేమని ఎన్‌ఐసీ విభాగం వారు చెబుతున్నారు. ఎన్‌ఐసీ విభాగం వారు ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారా లేదా అనేది తెలియడంలేదు. కలెక్టర్ ఒక్కసారి అయినా జిల్లా వెబ్‌సైట్ చూస్తే కొంత మేరకైనా మెరుగుపడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జిల్లా వెబ్‌సైట్‌లో పాత సమాచారం, తప్పుడు వివరాలు..

♦ 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 35,22,644. ఈ వివరాలు వచ్చి రెండేళ్లు కావస్తున్నా జిల్లా వెబ్‌సైట్‌లో 2001 ప్రకారం 32.46 లక్షల జనాభా అని మాత్రమే ఉంది.
♦ వరంగల్.. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థగా మారింది. ఈ మేరకు కార్పొరేషన్ అన్ని చోట్ల బోర్డులను మార్చింది. ఈ వివరాలు వెబ్‌సైట్‌లో లేవు.
♦ గతేడాది జిల్లాలో 962 గ్రామ పంచాయతీలకు ఎన్నికలయ్యాయి. వెబ్‌సైట్‌లో ని సమాచారంలో మాత్రం జిల్లాలో 1014 పంచాయతీలు ఉన్నట్లుగా ఉంది.
♦ జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలకు.. భూపాలపల్లి, నర్సంపేట, పరకాల నగర పంచాయతీలకు గతేడాది ఎన్నికలు జరిగాయి. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో జిల్లాలో రెండు మున్సిపాలిటీలు ఉన్నట్లు పేర్కొన్నారు.
♦ వరంగల్ జిల్లాకు దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర 2010లోనే జరిగినట్లు వెబ్‌సైట్‌లో పెట్టారు. ఆ ఏడాది జనవరి 27 నుంచి నాలుగు రోజులు జాతర జరిగిందని పేర్కొన్నారు. 2012, 2014 సంవత్సరాల్లో జాతర జరిగిన విషయం అధికారులు గుర్తించినట్లు లేదు.
♦అన్నింటి కంటే ముఖ్యంగా జిల్లా పరిపాలనలో కీలకమైన జేసీ ఎవరు అనే విషయం వెబ్‌సైట్‌లో కనిపించడంలేదు. ఇతర కీలక శాఖల అధికారులు సమాచారం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement