- తనిఖీలు, పెట్రోలింగ్ మరచిన పోలీసులు
- రెచ్చిపోతున్న అసాంఘికశక్తులు
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసులు పెట్రోలింగ్, వాహన తనిఖీలను పూర్తిగా పక్కన పెట్టేశారు. గతవారం రోజుల్లో నగరంలో జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణ . ఎన్నికలప్పుడు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదుతో పాటు మారణాయుధాలు పట్టుబడ్డాయి. ఎన్నికలు ముగిశాక.. ఇక గస్తీ, వాహన తనిఖీలు ఎందుకనుకున్నారో ఏమో.. పోలీసులు వాటిపై దృష్టి పెట్టడంలేదు.
దీంతో రౌడీషీటర్లు, దొంగలు, స్నాచర్లు రాత్రి, పగలు అనే తేడాలేకుండా రెచ్చిపోతున్నారు. నగర కొత్త పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని చెప్తుండగా... కింది స్థాయిలో మాత్రం అది ఆచరణకు నోచుకోకపోవడంతో అసాంఘికశక్తులు విజృంభిస్తున్నాయి. గత వారం రోజుల్లో బేగంపేట, సుల్తాన్‌బజార్, చాదర్‌ఘాట్, హుస్సేనీఆలంలో జరిగిన ఘటనలు పోలీసుల పని తీరును వెక్కిరిస్తున్నాయి.
రాత్రి గస్తీలేకే....
ఈనెల 21వ తేదీ తెల్లవారుజాము 4.30కి బేగంపేట పోలీసుస్టేషన్ పరిధిలోని అన్నానగర్‌లో పాలవ్యాపారి తిరుపతిరా వు (29)పై శ్రీనివాస్ (ఇతనిపై వివిధ ఠా ణాలలో 30కి పైగా కేసులున్నాయి) పథకం ప్రకారం కళ్లల్లో కారం చల్లి ఇనుపరాడ్‌తో మోది హత్య చేశాడు. రాత్రి పూట పోలీసుల గస్తీలేక పోవడం వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గస్తీ ఉండి ఉంటే.. పోలీసులు ఘటనకు అరగంట ముందు నుంచే శ్రీనివాస్ పట్టుకొని తిరిగిన ఐరన్ రాడ్‌ను స్వాధీనం చేసుకొని ఉండేవారని, తిరుపతిరావు హ త్యకు గురై ఉండేవాడు కాదని స్థానికు లు అభిప్రాయపడుతున్నారు. నిందితుడు శ్రీ నివాస్ ఆగడాలు రోజు రోజుకూ అధికమవుతున్నాయని, పోలీసులు అతడిపై కఠి న చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కత్తులతో స్వైరవిహారం...
చాదర్‌ఘాట్ ఠాణా పరిధిలోని వాహెద్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ ఖాలేద్ (20)పై పాత కక్షల నేపథ్యంలో ఈనెల 20న అదే కాలనీకి చెందిన పాతనేరస్తులు ఖాలాహిమ్నా, వాసిఫ్, అమర్‌లాల్ కత్తులతో దాడి చేశారు. ఖాలేద్ కడుపు, చేయి, తొడ భాగాల్లో తీవ్రగాయాలయ్యాయి.
పట్టపగలే చోరీ...
సుల్తాన్‌బజార్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటకు దొంగలు తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి.. రూ.10 లక్షల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ్లారు.
చార్మినార్ సాక్షిగా....
రక్షణ శాఖ శాస్త్రవేత్త ఆర్.సత్‌పత్తిపై చైన్‌స్నాచర్ కత్తితో దాడి చేశాడు. చార్మినార్ సాక్షిగా.. పోలీసు స్టేషన్ ఎదుటే ఆదివా రం మధ్యాహ్నం 12.30కి ఈ ఘటన జరిగింది. నగరంలో చైన్‌స్నాచర్ల స్వైరవిహారం నిత్యకృత్యంగా మారింది. అయి నా.. పోలీసులు మాత్రం స్నాచర్లను నియంత్రించలేకపోతున్నారు. నగరంలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలని ఒకపక్క ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా.. మరోపక్క పోలీసులు తమ విధులను మరచిపోవడం గమనార్హం. ఇప్పటికైనా గస్తీని పెంచి అసాంఘికశక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రజలు కోరుతు న్నారు.