నర్సాపూర్ కేంద్రంగా వెటర్నరీ మందుల విక్రయాలు
నర్సాపూర్ : నర్సాపూర్ కేంద్రంగా అనుమతుల్లేకుండా వెటర్నరీ మందులను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇటీవల జిల్లాలోని రామాయంపేటలో అక్రమంగా పశువుల మందులు అమ్ముతున్న వారిపై అధికారులు కేసులు నమోదు చేశారు. కాగా, అదే సంస్థకు చెందిన వారు అనుమతులేకుండా గ్రామాలలో పర్యటిస్తూ పాడి రైతులు, మేకలు, గొర్రెల పెంపకందారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇంటింటికీ తిరిగి మందులు విక్రయిస్తున్నారు. నర్సాపూర్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని మందులు స్టోర్ చేశారు. ఇక్కడి నుంచి నిత్యం గ్రామాలకు వెళ్లి రైతులను బుట్టలో వేసుకుంటున్నారు. వారికి ఈ మందులు అంటకడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కంపెనీకి చెందిన ఫీడ్ కాల్షియం మందులతో పాటు పలు రకాల యాంటీబయాటిక్స్‌ను సైతం గ్రామాలకు తరలిస్తున్నారు. కరపత్రాలు ముద్రించి మరీ యథేచ్ఛగా అమ్మకాలు సాగించేస్తున్నారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండానే...
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి మందులు అమ్మరాదని జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు ఆదేశిస్తున్నా వీరు లెక్క చేయడం లేదు. అనుమతులు, మందుల చీటీలు లేకుండా మందులు విక్రయిస్తున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పట్టణంలోని పలువురు మెడికల్ షాపుల నిర్వహకులు అధికారులను కోరుతున్నారు. కాగా... కంపెనీ ప్రతినిధి ఆంజనేయులును వివరణ కోరగా... తాము ఫీడ్ కాల్షియం, బయోవిటమిన్ మందులే అమ్ముతున్నామని చెప్పారు. ఇతర మందులు అమ్మడం లేదన్నారు.
అనుమతులు నిల్... అమ్మకాలు ఫుల్!
Published Thu, Jul 30 2015 11:30 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement