ఇది ప్రజా ప్రభుత్వం: కవిత
బోధన్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముమ్మాటికీ ప్రజాపక్షమని, సమస్యలపై ప్రభుత్వాన్ని.. ప్రజాప్రతినిధులను నిలదీసే హక్కు ప్రజలకు, ప్రజా సంఘాలకు ఉందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆదివారం తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు, కళాకారులు, ఉద్యమకారులను సన్మానించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో కవిత మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ కిందిస్థాయిలో ఉద్యోగుల విభజన జరగలేదని, అందుకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని పలుమార్లు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అంతకుముందు బోధన్ మండలం భవానీపేట్‌లో బోనాల పండుగలో ఎంపీ మాట్లాడు తూ జోగిని, విడాకులు పొందిన మహిళలకు పింఛన్ల మంజూరు విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే వీరికి పెన్షన్లు అందించే అవకాశం ఉందని చెప్పారు.
తెలంగాణలో 21 వేల మంది జోగినీలున్నారని తెలిపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రైతులకు అప్పగిస్తామని, వారికి ఒక్క పైసా నష్టం కలుగకుండా చూస్తామని తెలిపారు.
చంద్రబాబువి దివాలాకోరు రాజకీయాలు..
ఏపీ సీఎం చంద్రబాబు దివాళాకోరు రాజకీయూలకు పాల్పడుతున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి డబ్బులు పంచుతూ ఏసీబీకి దొరకడం ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు.