సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఆంధ్రకు వెళ్లాల్సిన అధికారులను రిలీవ్ చేయడంలోనూ ప్రభుత్వం జాప్యం చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులను ఆదివారం రిలీవ్ చేయడంతో సోమవారం సాయంత్రంలోగా సీనియర్ అధికారులంతా తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్టు చేశారు. ఆల స్యం అవుతున్న తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 7వ తేదీన వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లే ముందు పోస్టింగుల ఉత్తర్వులపై సంతకం చేసి వెళ్తారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం ఆ ఫైలుపై సంతకం చేయలేదు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న దాదాపు 22 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేశారు. అలాగే 22 మంది ఐపీఎస్‌లను కూడా రిలీవ్ చేశారు. ఇప్పుడా పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. తెలంగాణకు తక్కువ మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారంటూ ఒక్కో అధికారికి ఐదారు శాఖలు కేటాయించడంతో.. ఏడు నెలలుగా పాలన కుంటినడక నడుస్తోంది. ఇప్పటికే కీలక పదవుల్లో ఉన్న అధికారులను మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకే నగరంలో ఉన్నవారు 24 గంటల్లోగా విధుల్లో చేరాలన్న నిబంధనతో అఖిల భారత సర్వీసు అధికారులు విధుల్లో చేరినా.. వారంతా పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తుండడం గమనార్హం.
దరఖాస్తులకు నేటితో గడువు ముగింపు
గతనెల 26వ తేదీన అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన తరువాత అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. శనివారంతో ఆ గడువు ముగియనుంది. కొత్తగా రెండేళ్లలో పదవీ విరమణ చేసే అధికారులు తమకు కావాల్సినచోట పనిచేయడానికి విజ్ఞప్తి చేసుకోవచ్చని పేర్కొనడంతో టి.రాధ తెలంగాణలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అలాగే శాలినిమిశ్రా, జ్యోతి బుద్ధప్రకాశ్ సతీమణి ఐఎఫ్ ఎస్ అధికారి తెలంగాణకు రావడానికి దరఖాస్తు చేసుకున్నారు.
క్యాట్‌ను ఆశ్రయించిన ఐఎఫ్‌ఎస్ కిషన్
తనను తెలంగాణకు కేటాయించినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సస్పెన్షన్‌కు గురయ్యానన్న కారణంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయడం లేదంటూ ఐఎఫ్‌ఎస్ అధికారి ఎ.కిషన్ క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు క్యాట్ సభ్యులు కాంతారావు, మిన్నీమాథ్యూలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారిం చింది. తెలంగాణకు కేటాయించిన నేపథ్యంలో తనపై క్రమశిక్షణాచర్యలు తీసుకునే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని నివేదించారు. పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు కేంద్రం, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు క్యాట్ సభ్యులు నోటీసులు జారీ చేస్తూ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.
ఐదురోజులు దాటినా నో పోస్టింగ్స్
Published Sat, Jan 10 2015 4:34 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement
Advertisement