తెలంగాణలో ఆదాయం అంతగా లేదు!
తెలంగాణలో ఆదాయం అంతగా లేదు!
Published Sat, Sep 20 2014 1:38 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
సమైక్య రాష్ర్టంలో వచ్చినంత ఆదాయం ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టంలో రాదని కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం వివరించింది. అందువల్ల సవరించిన ఆదాయాన్నే పరిగణనలోకి తీసుకుని తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. ‘‘సమైక్య రాష్ట్రంలో ఎక్కడ అమ్మకాలు జరిగినప్పటికీ హైదరాబాద్‌లోనే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) చెల్లించారు. బెవరేజ్ కార్పొరేషన్ కూడా ఇలాగే వ్యాట్ చెల్లించింది. సచివాయలం, అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉండటం... పే అండ్ అకౌంట్స్ ఆఫీసూ ఉండటంతో అన్ని చెల్లింపులు ఇక్కడే జరుగుతూ వచ్చాయి. తద్వారా వ్యాట్ ఆదాయంలో హైదరాబాద్‌కు 80 శాతం వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే అభిప్రాయమూ ఇప్పుడూ కొనసాగుతోంది.
ఆయిల్ కంపెనీలు 30 శాతం వ్యాట్ చెల్లింపులను హైదరాబాద్‌లోనే చేస్తున్నాయి. వాస్తవ వినియోగం మాత్రం 8 శాతం మాత్రమే. 2012-13 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే ఆయిల్ కంపెనీల నుంచి వచ్చే వ్యాట్ ఆదాయం తెలంగాణలో 48 శాతం కాగా, ఆంధ్రాలో 52 శాతం. బెవరేజ్ కార్పొరేషన్ వాస్తవ అమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ ఎక్సైజ్ ఆదాయం 45 శాతం మాత్రమే. ఇందులో హైదరాబాద్ వాటా 8 శాతమే. కేవలం 850 ప్రధాన డీలర్లను పరిగణనలోని తీసుకుని మొత్తం వ్యాట్ ఆదాయంలో తెలంగాణ వాటా 53 శాతమని లెక్కించారు. ఇది సరికాదు. వ్యాట్ ఆదాయంలో తెలంగాణ వాటా 42 నుంచి 44 శాతం మాత్రమే ఉంటుంది. పన్నుల ఆదాయంలో దీనినే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. దీని ఆధారంగానే ఐదేళ్ల పాటు రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయాలని అభ్యర్థిస్తున్నాం’’ అని రాష్ర్ట ప్రభుత్వం మొరపెట్టుకుంది.
Advertisement
Advertisement