-
కొత్త రాష్ట్రం.. 9 జిల్లాలు వెనుకబడ్డవే
-
ఆర్థికంగా చేయూతనివ్వండి
-
14వ కేంద్ర ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి
-
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలంటే అధిక నిధులివ్వండి
-
అనుకున్న స్థాయిలో హైదరాబాద్ ఆదాయం లేదని వివరణ
-
రాష్ర్టంలో ప్రధాన సమస్యలు, ప్రభుత్వ ప్రాధాన్యతల వెల్లడి
-
రుణమాఫీ, వాటర్ గ్రిడ్, సంక్షేమం తదితర పథకాల ప్రస్తావన
-
25 రంగాల అభివృద్ధికి రూ.20,950 కోట్ల గ్రాంట్ ఇవ్వాలని వినతి
-
కేంద్ర పన్నుల్లో వాటాను 40 శాతానికి పెంచండి
-
తలసరి ఆదాయం పెరుగుతుంటే నిధులు తగ్గించ డం సరికాదు
-
జనాభాకు 25 శాతం, విస్తీర్ణానికి 30 శాతం వెయిటేజీ ఇవ్వండి
-
కొత్త రాష్ట్రానికి మినహాయింపులు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి.. పలు అంశాలపై కేసీఆర్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ర్ట ప్రభుత్వం కోరింది. రాష్ర్టం అన్నిట్లో వెనుకబడి ఉందని, ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలవాలని విజ్ఞప్తి చేసింది. నూతన రాష్ట్రం కావడంతో ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాల్సి ఉందని, కొత్త పథకాల అమలుకు తగిన సహాయాన్ని అందించాలని విన్నవించింది. ఈ మేరకు సమైక్య రాష్ట్రంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొనడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ ఆర్థిక సంఘానికి నివేదిక సమర్పించింది. కీలకమైన 25 రంగాల్లో అభివృద్ధి కోసం రూ. 20,950 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇవ్వాలని ప్రతిపాదనలు అందించింది. గురువారమే హైదరాబాద్‌కు వచ్చిన 14వ ఆర్థిక సంఘంతో శుక్రవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. ‘తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలుంటే.. తొమ్మిది జిల్లాలు వెనుకబడే ఉన్నాయి. అన్ని సూచికల్లోనూ వెనుకబడి ఉన్నాం. మాకు అధిక నిధులిచ్చి ఆదుకోండి’ అని ఈ సందర్భంగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అలాగే కేంద్ర పన్నుల కేటాయింపులో ఉన్న అసంబద్ధ వెయిటేజీలను మార్చాలని, కేంద్ర పన్నుల్లో ప్రస్తుతం రాష్ట్రాలకు ఇస్తున్న 32 శాతం వాటాను 40 శాతానికి పెంచాలని కూడా డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటిస్తున్న కొత్త పథకాలతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతోందని, మరోవైపు కష్టమైనప్పటికీ ద్రవ్య జవాబుదారీ, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టాన్ని అమలు చేయాల్సి వస్తోందన్నారు. తెలంగాణ ప్రజల కల ఇంతకాలానికి నెరవేరిందని, ఆరు దశాబ్దాలుగా అణచివేతకు గురైన తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆర్థిక సంఘం నుంచి విరివిగా నిధులిచ్చేందుకు కేంద్రానికి సూచించాలని కేసీఆర్ విన్నవించారు. తెలంగాణను వెనుకబడిన ప్రాంతంగా స్పష్టం చేసిన అనేక నివేదికలు, అభివృద్ధి సూచికలను ఈ సందర్భంగా ఆయన ఆర్థిక సంఘం దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఆదాయం కూడా అనుకున్న స్థాయిలో లేదని వివరించారు. ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మెమోరాండం సమర్పిస్తూ పలు అంశాలపై కేసీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా తమ తమ శాఖల వారీగా ప్రజెంటేషన్ ఇచ్చారు.
తలసరి ఆదాయం పెరిగితే...
తలసరి ఆదాయం పెరగడానికి ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అభినందించాలని, వెయిటేజీ పేరిట తగ్గించడం సరికాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తలసరి ఆదాయానికి ఎక్కువ వెయిటేజీతో రాష్ట్రం నష్టపోతోందన్నారు. కేంద్ర పన్నుల వాటాలో జనాభాకు 25 శాతం, రాష్ట్ర విస్తీర్ణానికి 30 శాతం వెయిటేజీ ఇచ్చి నిధులు కేటాయించాలని కోరారు. ద్రవ్య క్రమశిక్షణకు 27.5 శాతం, ద్రవ్య వ్యత్యాసానికి 17.5 శాతం వెయిటేజి ఇవ్వాలని విన్నవించారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1971 తర్వాత తెలంగాణ ప్రాంతానికి వలసలు భారీగా జరిగాయని తద్వారా జనాభా పెరిగిందన్నారు. అందుకు తగినట్లు మౌలికవసతుల కల్పనకు అధిక నిధులివ్వాల్సిందిపోయి.. కోతపెట్టడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. వెనుకబడిన రాష్ట్రాలకు ఇతర మార్గాల ద్వారా నిధులు సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రస్తావించిన పలు అంశాలు ఇలా ఉన్నాయి.
- కేంద్రానికి పన్నేతర ఆదాయం విపరీతంగా పెరుగుతోంది. సముద్రతీర రాయల్టీ, స్పెక్ట్రమ్ అమ్మకం, పెట్టుబడుల ఉపసంహరణతో భారీ ఆదాయం లభిస్తోంది. వీటన్నింటిలో రాష్ట్రానికి వాటాను పంచాలి. సెస్సు, సర్‌ఛార్జీలు విధించడం వల్ల వచ్చే ఆదాయాన్ని కూడా రాష్ట్రాలకు ఇవ్వాలి.
- 40 శాతం కేంద్ర పన్నులను రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల.. కేంద్ర వ్యయంలో కేవలం ఐదు శాతం మాత్రమే తగ్గుతుంది.
- ఈక్విటీ పారామీటర్లలో ఎక్కువ వెయిటేజీ ఇవ్వడం వల్ల మధ్యాదాయ రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో భారీగా కోతపడుతోంది.
- రాష్ట్రాల ద్రవ్య, రెవెన్యూ లోటు పరిమితిని కేంద్రంతో సమానంగా రాష్ట్రాలకు ఇవ్వాలి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని రాష్ట్రాలపై రుద్దుతున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని పాటిస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలి.కొత్త రాష్ట్రాలకు ఈ చట్టంలో మినహాయింపులు ఇవ్వాలి.
- ఆర్థిక సర్దుబాటును సమర్థంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సహకాలు ఇవ్వాలి.
- పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ జాతీయ సంస్థ(ఎన్‌ఐపీఎఫ్‌పీ) అధ్యయనం ప్రకారం 1998-99లో సబ్సిడీల మొత్తం రూ. 2,35,752 కోట్లు కాగా, ఇందులో రాష్ట్రాల మీద పడిన భారం ఏకంగా రూ. 1,55,924 కోట్లు. అంటే 66 శాతం. ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా భారంగా మారుతోంది. అందువల్ల సబ్సిడీ భారాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య సమంగా పంచాలి. అలాగే రాష్ట్రాలు భరించే సబ్సిడీ భారాన్ని కేంద్రం కూడా భరించాలి.
- కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రెవెన్యూ మిగులు కష్టం. తద్వారా మూలధన పెట్టుబడి సాధ్యం కాదు. కావున రెవెన్యూ ఖాతాలోకి కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగితే తప్ప సాధ్యం కాదు.
- టోకుమొత్తంలో డీజిల్ కొనుగోలుదార్ల(రైల్వే, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు)కు మార్కెట్ ధరకు డీజిల్ విక్రయించడం వల్ల.. ప్రజా రవాణా వ్యయం పెరుగుతోంది. ప్రైవేట్ రవాణా పెరిగి కాలుష్యానికి దారితీస్తోంది.
- ప్రణాళిక పథక రచనలో ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సుల(నాన్ సాలరీ)ను పరిగణలోకి తీసుకోవాలి.
- పర్యావరణ పరిరక్షణ చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
- ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం ప్రస్తుతం ఇస్తున్న 75 శాతం నష్టపరిహార వాటాను 90 శాతానికి పెంచాలి.
- సామాజిక న్యాయం మరింత పకడ్బందీగా అమలు కావాలంటే.. రాష్ట్రాలకు నిధులు అధికంగా ఇవ్వాలి.
- రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే పౌర సేవల ధర నిర్ణయాధికారంపై కమిషన్ ఎలాంటి నియంత్రను సిఫారసు చేయొద్దు.
వెనుకబాటుపై నివేదికలివిగో..!
తెలంగాణ వెనుకబడిందని అనేక నివేదికలు తేల్చి చెప్పాయని, మానవాభివృద్ధి సూచిక మొదలు, టాస్క్‌ఫోర్స్ నివేదికలు సైతం తెలంగాణ అత్యంత వెనుకబడిన ప్రాంతమని స్పష్టం చేస్తున్నాయని ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం తన నివేదికలో వివరించింది. దీని ప్రకారం...
- ప్రాంతీయ అసమానతలను పరిష్కరించడంపై ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర మంత్రుల టాస్క్‌ఫోర్స్ దేశవ్యాప్తంగా 170 అత్యంత వెనుకబడిన జిల్లాలను గుర్తించింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి మినహా తెలంగాణలోని మిగిలిన ఎనిమిది జిల్లాలు ఉన్నాయి.
- వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ (బీఆర్‌జీఎఫ్) అమలు కోసం మానవాభివృద్ధి సూచిక తక్కువగా ఉన్న 250 జిల్లాలను కేంద్రం 2007లో గుర్తించింది. ఇందులో తొమ్మిది తెలంగాణ జిల్లాలు ఉన్నాయి.
- ఉపాధి హామీ పథకాన్ని దేశం మొత్తం 187 జిల్లాల్లో ప్రాథమికంగా ప్రారంభిస్తే, హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అమలు చేశారు.
- వ్యవసాయ ఉత్పత్తి దారుణంగా ఉన్న 100 జిల్లాలను దేశవ్యాప్తంగా కేంద్రం 2007లో గుర్తించింది. ఇందులో తెలంగాణలోని ఏడు జిల్లాలు ఉన్నాయి.
- 12వ పంచవర్ష ప్రణాళికలో ప్రాంతీయ అసమానతల చాప్టర్‌లో తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలను ‘అత్యంత ఆకలి జిల్లాలు’గా పేర్కొన్నారు.
- తెలంగాణలో వృద్ధిరేటు 2005-06లో 10.5 శాతం నుంచి 2012-13 నాటికి 4.5 శాతానికి పడిపోయింది. పైగా పారిశ్రామిక రంగంలో అభివృద్ధి తిరోగమనదిశలో (నెగటివ్ డెవలప్‌మెంట్) ఉంది. అయితే 2013-14లో వృద్ధిరేటు కొంచెం పెరిగి 5.5 శాతానికి చేరినప్పటికీ, వ్యవసాయ రంగ అభివృద్ధి మాత్రం 6.2 శాతం నుంచి 4.6 శాతానికి పడిపోయింది.
ఇవీ రాష్ర్టంలో సమస్యలు!
-
ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం పలు ప్రధాన సమస్యలను ఏకరవుపెట్టింది. అవి ఇలా ఉన్నాయి.
-
- సుమారు 60 శాతం భూమికి నీరు అందించే చెరువుల వ్యవస్థ ధ్వంసమైపోయింది. ప్రస్తుతం చెరువుల కింద సాగు 9 శాతం కంటే తక్కువకుపడిపోయింది.
-
- 2001-02 నుంచి 2009-10 వరకు తెలంగాణ, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు భారీగా విక్రయించారు. దీనివల్ల జిల్లా రైతాంగం తమ జీవనాధారాన్ని కోల్పోయింది. ఈ నష్టాన్ని పూడ్చడం సాధ్యమయ్యే పనికాదు.
-
- రాష్ర్టం 1000 మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. దీన్ని పూడ్చేందుకు భారీగా పెట్టుబడులతో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
-
- రోడ్లు, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా కొరకు అనేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఇందులో మెట్రోరైలు ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టుల వల్ల వచ్చే ఎనిమిదేళ్ల వరకూ ఏటా రూ. 333 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
-
- 1961-71 మధ్యకాలంలో తెలంగాణలో పట్టణ జనాభా 35.6 శాతం ఉండగా... 2001-11 నాటికి అది 39.1 శాతానికి పెరిగిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి అనేక మంది రావడం వల్ల పట్టణ జనాభా పెరిగింది. ఈమేరకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
-
- పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.
ఇవీ రాష్ర్ట ప్రభుత్వ ప్రాధాన్యతలు
-
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు పథకాలను ఈ సందర్భంగా రాష్ర్ట ప్రభుత్వం తన ప్రాధాన్యతలుగా పేర్కొంటూ ఆర్థిక సంఘం దృష్టికి తెచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
-
- దేశంలోకెల్లా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలోనే అధికం. అందుకే రుణాల ఊబి నుంచి రైతులను బయటపడేసేందుకు వాటిని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-
- ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీల కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నాం. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. బీసీలకు ఐదేళ్ల కాలంలో రూ. 25 వేల కోట్లు వెచ్చించనున్నాం. మైనార్టీలకు రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తాం.
-
- ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా కోసం రూ. 25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.
-
- వచ్చే మూడేళ్లల్లో 230 కోట్ల మొక్కలను నాటాలని ‘తెలంగాణకు హరిత హారం’ కార్యక్రమం ప్రారంభించాం.
-
- శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తున్నాం.
సమస్యలు ఇవీ..!
-
ఆర్థిక సంఘానికి రాష్ర్ట ప్రభుత్వం పలు సమస్యలను ఏకరువు పెట్టింది. అవి ఇలా ఉన్నాయి.్హ సుమారు 60 శాతం భూమికి నీరు అందించే చెరువుల వ్యవస్థ ధ్వంసమైపోయింది. ప్రస్తుతం చెరువుల కింద సాగు 9 శాతం కంటే తక్కువకుపడిపోయింది.
-
2001-02 నుంచి 2009-10 వరకు తెలంగాణ, ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు భారీగా విక్రయించారు. దీనివల్ల జిల్లా రైతాంగం తమ జీవనాధారాన్ని కోల్పోయింది. ఈ నష్టాన్ని పూడ్చడం సాధ్యమయ్యే పనికాదు.
-
రాష్ర్టం 1,000 మెగావాట్ల విద్యుత్ లోటును ఎదుర్కొంటోంది. దీన్ని పూ డ్చేందుకు భారీ పెట్టుబడులతో విద్యు త్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
-
రోడ్లు, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా కొరకు అనేక ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ఇందులో మెట్రోరైలు ప్రాజెక్టు ఒకటి. ఈ ప్రాజెక్టుల వల్ల వచ్చే ఎనిమిదేళ్ల వరకూ ఏటా రూ. 333 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
-
1961-71 మధ్యకాలంలో తెలంగాణలో పట్టణ జనాభా 35.6 శాతం ఉండగా... 2001-11 నాటికి అది 39.1 శాతానికి పెరిగిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి అనేక మంది రావడం వల్ల పట్టణ జనాభా పెరిగింది. ఈమేరకు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
-
పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.