కేసీఆర్ ప్రస్తావించిన పలు అంశాలు
- 40 శాతం కేంద్ర పన్నులను రాష్ట్రాలకు ఇవ్వడం వల్ల.. కేంద్ర వ్యయంలో కేవలం ఐదు శాతం మాత్రమే తగ్గుతుంది.
- ఈక్విటీ పారామీటర్లలో ఎక్కువ వెయిటేజీ ఇవ్వడం వల్ల మధ్యాదాయ రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటాలో భారీగా కోతపడుతోంది.
- రాష్ట్రాల ద్రవ్య, రెవెన్యూ లోటు పరిమితిని కేంద్రంతో సమానంగా రాష్ట్రాలకు ఇవ్వాలి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని రాష్ట్రాలపై రుద్దుతున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని పాటిస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలి.కొత్త రాష్ట్రాలకు ఈ చట్టంలో మినహాయింపులు ఇవ్వాలి.
- ఆర్థిక సర్దుబాటును సమర్థంగా అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
- పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ జాతీయ సంస్థ(ఎన్‌ఐపీఎఫ్‌పీ) అధ్యయనం ప్రకారం 1998-99లో సబ్సిడీల మొత్తం రూ. 2,35,752 కోట్లు కాగా, ఇందులో రాష్ట్రాల మీద పడిన భారం ఏకంగా రూ. 1,55,924 కోట్లు. అంటే 66 శాతం. ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా భారంగా మారుతోంది. అందువల్ల సబ్సిడీ భారాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య సమంగా పంచాలి. అలాగే రాష్ట్రాలు భరించే సబ్సిడీ భారాన్ని కేంద్రం కూడా భరించాలి.
- కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రెవెన్యూ మిగులు కష్టం. తద్వారా మూలధన పెట్టుబడి సాధ్యం కాదు. కావున రెవెన్యూ ఖాతాలోకి కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగితే తప్ప సాధ్యం కాదు.
- టోకుమొత్తంలో డీజిల్ కొనుగోలుదార్ల(రైల్వే, ఆర్టీసీ, విద్యుత్ సంస్థలకు)కు మార్కెట్ ధరకు డీజిల్ విక్రయించడం వల్ల.. ప్రజా రవాణా వ్యయం పెరుగుతోంది. ప్రైవేట్ రవాణా పెరిగి కాలుష్యానికి దారితీస్తోంది.
- ప్రణాళిక పథక రచనలో ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సుల(నాన్ శాలరీ)ను పరిగణలోకి తీసుకోవాలి.
- పర్యావరణ పరిరక్షణ చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
- ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేంద్రం ప్రస్తుతం ఇస్తున్న 75 శాతం నష్టపరిహార వాటాను 90 శాతానికి పెంచాలి.
- సామాజిక న్యాయం మరింత పకడ్బందీగా అమలు కావాలంటే.. రాష్ట్రాలకు నిధులు అధికంగా ఇవ్వాలి.
- రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే పౌర సేవల ధర నిర్ణయాధికారంపై కమిషన్ ఎలాంటి నియంత్రణను సిఫారసు చేయొద్దు.