క్యాంపస్‌ కొలువు కష్టమే | No Jobs For Lack Of Coding Skills In MNCs | Sakshi
Sakshi News home page

కోడింగ్‌ రాకుంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కలే..

Published Sun, Jul 22 2018 2:06 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

No Jobs For Lack Of Coding Skills In MNCs - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి– హైదరాబాద్‌ : ఓ మోస్తరు కాలేజీలో ఇంజనీరింగ్‌ సీటు వచ్చిందంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం గ్యారంటీ.. టాప్‌ 10 కాలేజీల్లో సీటు వచ్చిందంటే ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయినట్టే.. 
రెండేళ్ల క్రితం వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న భావన ఇది! 
కానీ అనూహ్యంగా చోటుచేసుకున్న మార్పుల ఫలితంగా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. అగ్రశ్రేణి ఇంజనీరింగ్‌ కాలేజీలకు వచ్చి 250 మంది విద్యార్థులకు తగ్గకుండా ఉద్యోగ ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన దేశీయ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఏటా 10 నుంచి 12 వేల మందిని నియమించుకునే టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో వంటివి ఇప్పుడు ‘ఏ’కేటగిరి ఇంజనీరింగ్‌ కాలేజీలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అది కూడా టాలెంట్‌ టెస్ట్‌ల పేరుతో పరిమిత సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టి మూడు నుంచి ఆరు మాసాలపాటు శిక్షణ ఇచ్చే ఈ సంస్థలు ఇప్పుడు నైపుణ్యం కలిగిన విద్యార్థులను మాత్రమే ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. గతంలో మాదిరి ఆయా కాలేజీలకు వెళ్లి వేల మందికి ఒక రోజు పరీక్ష నిర్వహించి, మరో రోజు మౌఖిక పరీక్ష నిర్వహించి వందల మందిని ఎంపిక చేసుకునే ప్రక్రియకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశాయి. ఇన్ఫోసిస్‌ ‘హ్యాక్‌ విత్‌ ఇన్ఫీ’, కాగ్నిజెంట్‌ ‘టెక్నాలజీ హైరింగ్‌’పేరుతో విద్యార్థులకు కఠిన పరీక్షలు నిర్వహించి ఎక్కువ వేతనంతో నియమించుకుంటున్నాయి. ఈ కారణంగా హైదరాబాద్‌లో ప్రైవేట్‌ విద్యా రంగంలో టాప్‌ కాలేజీలుగా పేర్కొంటున్న సీబీఐటీ, వాసవి, శ్రీనిధి, ఎంవీఎస్‌ఆర్‌ కాలేజీల్లో సైతం 2018 పాస్డ్‌ అవుట్‌ విద్యార్థులకు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువ ఆఫర్లు వచ్చాయి. 

కోడింగ్‌ వస్తేనే.. 
దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోతోపాటు అమెరికన్‌ కంపెనీలు కాగ్నిజెంట్, యాక్సెంచర్‌ ఉద్యోగాలు ఆఫర్‌ చేయడానికి గతంలో మాదిరి ఒకరోజు రిక్రూట్‌మెంట్‌కు పరిమితం కావడం లేదు. కోడింగ్‌ బాగా తెలిసిన విద్యార్థులకు మాత్రమే అవకాశం ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, డెలాయెట్, అమెజాన్, ఒరాకిల్‌ వంటి అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ (సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతించి.. వారిలో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఉద్యోగ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ కారణంగా ప్రైవేట్‌ టాప్‌ కాలేజీల్లో ఐటీ సంబంధిత కోర్సుల్లో సీటు కోసం రూ.12 నుంచి రూ.15 లక్షల మేర డొనేషన్‌ చెల్లించడానికి తల్లిదండ్రులు పోటీ పడుతున్నారు. బీ, సీ కేటగిరీ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్లేస్‌మెంట్లు కూడా ఉండటం లేదని తెలియడంతో టాప్‌ కాలేజీల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

నాలుగు కాలేజీలకే పరిమితమైన కాగ్నిజెంట్‌ 
అమెరికన్‌ కంపెనీ కాగ్నిజెంట్‌ దేశవ్యాప్తంగా ఎనిమిది కాలేజీల్లో మాత్రమే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లు చేపట్టింది. వాటిలో హైదరాబాద్‌ కాలేజీలే నాలుగు ఉన్నాయి. సీబీఐటీ, వాసవి, ఎంవీఎస్‌ఆర్, శ్రీనిధి కాలేజీల్లో మాత్రమే టెక్నాలజీ హైరింగ్‌ పేరుతో నియామకాలు చేపట్టి కేవలం 12 మందికి ఉద్యోగాలు ఆఫర్‌ చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సంస్థ సీబీఐటీ కాలేజీ నుంచి 201 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఆఫర్‌ చేయగా ఈ ఏడాది ఐదుగురికి ఉద్యోగాలు ఆఫర్‌ చేసింది. వాసవీ కాలేజీలో 2017లో 121 మందికి ఆఫర్‌ చేసి.. ఈ ఏడాది పాసైన నలుగురు విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎంవీఎస్‌ఆర్‌ నుంచి ముగ్గురికి ఉద్యోగాలు ఆఫర్‌ చేయగా.. శ్రీనిధి కాలేజీ నుంచి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. 

టీసీఎస్, ఇన్ఫోసిస్‌లదీ అదే దారి 
దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌.. కాగ్నిజెంట్‌ దారిలోనే నడుస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు వందల సంఖ్యలో టాప్‌ కాలేజీల విద్యార్థులకు ఆఫర్లు ఇచ్చిన ఈ సంస్థలు 2017లో పరిమిత సంఖ్యలో నియమించుకున్నాయి. ఈ ఏడాది పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని, గతంలో మాదిరి ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగాల్లో చేర్చుకునే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు. ఈ కంపెనీలకు వస్తున్న ఆర్టర్లు, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో పని చేయడానికి అర్హులైన వారు లభించకపోవడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. 2016లో నాలుగు ప్రైవేట్‌ కాలేజీల్లో 753 మందికి ఉద్యోగాలు ఆఫర్‌ చేసిన ఇన్ఫోసిస్‌.. 2017కు వచ్చేసరికి ఆ సంఖ్యను 132కి తగ్గించింది. ఈ ఏడాది రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఆ కంపెనీ విధానమేమిటో ఇంకా వెల్లడి కాలేదు. ఇక టీసీఎస్‌ హైదరాబాద్‌లో పరిమితంగా రెండు లేదా 3 కాలేజీల్లో మాత్రమే నియామకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. 

కోడింగ్‌ రాకుంటే కష్టమే: ప్రొఫెసర్‌ ఎన్‌ఎల్‌ఎన్‌ రెడ్డి, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్, సీబీఐటీ 
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఎప్పటికప్పుడు ధోరణులు మారుతుంటాయి. దాన్ని బట్టే కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తాయి. కోడింగ్‌ రాకున్నా శిక్షణ ఇవ్వవచ్చులే అన్న అభిప్రాయం కంపెనీల్లో గతంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కోడింగ్‌ కచ్చితంగా తెలిసి ఉండాలి. జావా కోడింగ్‌తోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటా వంటివి కూడా ఇప్పుడు కంపెనీలకు అవసరం. ఐఐటీలు ఈ మధ్య సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీకి అవసరమైన కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. మిగిలిన యూనివర్సిటీలు, కాలేజీలు కూడా ఆ దిశగా అడుగులు వేయాలి. ఏదేమైనా గతంలో మాదిరి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం ఇప్పుడు అంత ఈజీ కాదు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement