
జీవో 59పై కదలిక ఏదీ..?
భూముల క్రమబద్ధీకరణ విషయమై సర్కారు తీసుకున్న నిర్ణయం పూర్తిస్థాయిలో అమలు కావట్లేదు. ప్రత్యేకించి జీవో నంబర్ 59 ప్రకారం ప్రభుత్వం స్వీకరించిన క్రమబద్ధీకరణ దరఖాస్తులు కనీస పరిశీల నకూ నోచుకోవట్లేదు.
- భూముల క్రమబద్ధీకరణ మార్గదర్శకాల్లో కొరవడిన స్పష్టత
- లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌పై గందరగోళం
- రెవెన్యూ కార్యాలయాల్లో అటకెక్కిన 46 వేల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ విషయమై సర్కారు తీసుకున్న నిర్ణయం పూర్తిస్థాయిలో అమలు కావట్లేదు. ప్రత్యేకించి జీవో నంబర్ 59 ప్రకారం ప్రభుత్వం స్వీకరించిన క్రమబద్ధీకరణ దరఖాస్తులు కనీస పరిశీల నకూ నోచుకోవట్లేదు. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టత కొరవడటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
వాస్తవానికి ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారికి ఆయా భూములను క్రమబద్ధీకరించేందుకు గతేడాది డిసెం బర్ 30న ప్రభుత్వం జీవో 58, 59లను జారీచేసింది. జీవో 58 మేరకు ఆయా భూములను పేదవర్గాలకు ఉచిత కేటగిరీలోనూ, ధనికులకు చెల్లింపు కేటగిరీలోనూ క్రమబద్ధీకరించాలి.
రెండు కేటగిరీల్లోనూ కలిపి మొత్తం 3,66,150 దరఖాస్తులు ప్రభుత్వానికి అందగా ఇందులో 3,36,869 లక్షల దరఖాస్తులు ఉచిత కేటగిరీకి చెందినవికాగా, మరో 29,281 దరఖాస్తులు చెల్లింపు కేటగిరీలో వచ్చాయి. ఉచిత కేటగిరీలో అందిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వీటిలో 1.30 లక్షల మంది అర్హులని తేల్చారు. అలాగే 16,915 దరఖాస్తులను చెల్లింపు కేటగిరీకి (కన్వర్షన్) మార్చారు. దీంతో చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల సంఖ్య 46,196కు చేరింది.
స్పష్టత ఇవ్వని సర్కారు
క్రమబద్ధీకరణ కోసం చెల్లింపు కేటగిరీలో వచ్చిన దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ప్రభుత్వ మార్గదర్శకాల్లో స్పష్టత కొరవడిందని అధికారులంటున్నారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ ధర ప్రకారం ఒకేసారి సొమ్ము చెల్లించిన వారికిగానీ, వాయిదాల పద్ధతిలో చెల్లించిన వారికిగానీ, ఆ స్థలాన్ని ఎవరు (ఆర్డీవో/తహశీల్దారు) రిజిస్ట్రేషన్ చేయాలో సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొనలేదంటున్నారు. ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీకి మార్చిన దరఖాస్తుల విషయంలోనూ స్పష్టత లేదంటున్నారు.
చెల్లింపు కేటగిరీలో ప్రస్తుతం 3వ వాయిదా చెల్లించాల్సిన సమయం కనుక, కన్వర్షన్ దరఖాస్తుదారుల నుంచి ఒకేసారి 3 వాయిదాల సొమ్ము వసూలు చేయాలా లేక వారు సొమ్ము చెల్లిం చేందుకు గడువు ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటున్నారు. ఉచిత క్రమబద్ధీకరణ గురించి పట్టించుకున్నంతగా చెల్లిం పు కేటగిరీ గురించి అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ మండల స్థాయి అధికారులు జీవో 59 దరఖాస్తులను అటకెక్కించేశారు. మార్గదర్శకాలపై స్పష్టత వస్తే తప్ప, క్రమబద్ధీకరణ ముందుకు కదిలే పరిస్థితి కనిపించట్లేదు.