ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ రాంకిషన్ గురువారం తన చాంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు.
మహబూబ్‌నగర్ టౌన్ : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్‌ఓ రాంకిషన్ గురువారం తన చాంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణ ఈనెల 26వరకు కొనసాగుతుంది. నామినేషన్లు వేసే అభ్యర్థులు ఎస్సీ , ఎస్టీలైతే *.10వేలు, ఇతరులైతే *5 వేలు చెల్లించి నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. మూడు జిల్లాలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థులంతా జీహెచ్‌ఎంసీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్లను అందించాల్సి ఉంటుంది. ఇక 27న నామినేషన్ల పరిశీలనతోపాటు, ఉపసంహరణ మార్చి 2న చేపట్టనున్నారు.
ఏర్పాట్లు పూర్తి
ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తిచేశారు. మార్చి 16న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకుగాను జిల్లాలో 97పోలింగ్ కేంద్రాలను అధికారికంగా గుర్తించారు. అయితే వెయ్యికి పైగా ఓట్లుండగా, పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాలని సీఈఓ బన్వర్‌లాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మరో 17పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. మార్చి 19న కౌంటింగ్‌ను హైదరాబాద్‌లోనే చేయనున్నారు.
ఓటరు నమోదుకు ముగిసిన గడువు
పట్టభద్రులకు సంబంధించి కొత్త వారికి కల్పించిన నమోదు అవకాశం గురువారంతో ముగిసింది. గడువు ముగిసే నాటికి 4వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల అంచనా. ఇంత వరకు 66,650మంది ఓటర్లు ఉండగా, కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఎంత మందికి అవకాశం వస్తోందో ఆ ప్రకారం జాబితా సంఖ్య పెరిగే అవకాశం ఉంది.