చెరువు గట్లపై సీడ్‌బాల్స్ చల్లుతున్న మక్తపల్లి గ్రామస్తులు
సాక్షి, అల్గునూర్(పెద్దపల్లి ) : ‘వానలు వాపస్ రావాలి..కోతులు వాపస్ పోవాలి’ అని కేసీఆర్ చెప్పిన మాటను తూచ తప్పకుండా పాటిస్తున్నాడు మక్తపల్లివాసి. కేసీఆర్ స్ఫూర్తితో మొక్కల పెంపకానికి నడుం బిగించాడు. ఇప్పటి వరకు లక్ష సీడ్‌బాల్స్ సొంతంగా తయారు చేయించి పంపిణీ చేయించిన హరిత ప్రేమికుడు ఎన్‌ఆర్‌ఐ నరేందర్ పలువురు ప్రశంసలు అందుకుంటున్నాడు. తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన చింతం కనకలక్ష్మి–రాములు దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె సంతానం. మూడో కుమారుడు నరేందర్. నరేందర్ అమెరికాలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి అక్కడే స్థిరపడ్డారు. మిత్రులతో కలిసి నవ సమాజ నిర్మాణ సమితి పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించి పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వివిధ సేవా కార్యక్రమాలు
పేదల పిల్లల ఉన్నత చదువుకు సాయం అందిస్తున్నారు. పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని వారికి ఆర్థికసాయం చేయిస్తున్నారు. గతేడాది అడవుల్లోని జంతువులు, పక్షులు నీరులేక చనిపోతున్నాయని మిత్రుల ద్వారా తెలుసుకున్న నరేందర్ అడవుల్లో నీటికుండీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
హరితహారంపై దృష్టి..
సీఎం కేసీఆర్ స్ఫూర్తితో నరేందర్ తిమ్మాపూర్ మండలాన్ని హరిత మండలంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే స్వగ్రామం మక్తపల్లికి వచ్చిన నరేందర్ బెంగళూర్‌లోని ప్రముఖ విత్తన కంపెనీ, నర్సరీ తయారీ కంపెనీని కలిసి సీడ్‌బాల్స్ తయారీకి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలి విడతగా లక్ష సీడ్ బాల్స్ తయారీకి ఆర్డర్ ఇచ్చాడు. చింత, తుమ్మ, రావి, జువ్వి, మర్రి, మారేడు, మేడి, నేరేడు, మామిడి, పుల్చింత, సపోటా, జామ తదితర విత్తనాలతో సీడ్‌బాల్స్ తయారు చేయాలని కోరాడు. సుమారు రూ.50 వేల వరకు ఖర్చు చేశాడు. తొలి విడతగా సుమారు 50 కిలోల సీడ్ బాల్స్ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి పంపించగా విత్తనాలను ఆయన మిత్రులు గురువారం గ్రామంలో బాబింగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment