‘నంబర్’గేమ్ షురూ | number game started | Sakshi
Sakshi News home page

‘నంబర్’గేమ్ షురూ

Published Sun, Jun 22 2014 1:47 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

‘నంబర్’గేమ్ షురూ - Sakshi

సాక్షి, హైదరాబాద్: నంబర్‌ప్లేట్లు మార్చుకోవడానికి వాహనదారులకు చేతిచమురు వదలక తప్పేలా లేదు. పాత వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్‌ప్లేట్ల విషయంలో ఎంతో కొంత రుసుము వసూలు చేసే దిశగా తెలంగాణ రవాణాశాఖ అడుగులేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సిరీస్ వచ్చిన నేపథ్యంలో వాహనాల నంబర్ ప్లేటుపై ఏపీ అక్షరాల బదులు టీఎస్ అక్షరాలు, జిల్లా పాత కోడ్ నంబరు బదులు కొత్త కోడ్‌ను మార్చుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాటి ఆర్‌సీ కార్డులను కూడా మార్పించుకోవాలి. ఇందుకోసం ద్విచక్రవాహనాలకు రూ.100, కార్లు, అంతకంటే పెద్ద వాహనాలకు రూ.200 చొప్పున రుసుము వసూలు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో విధివిధానాలు ఖరారు కానున్నాయి.
 
 తెలంగాణకు ఇటీవల కేంద్రప్రభుత్వం టీఎస్ సిరీస్‌ను కేటాయించిన నేపథ్యంలో.. ఇప్పటికే ఏపీ సిరీస్‌తో తిరుగుతున్న పాత వాహనాల నంబర్ల ప్లేట్లను కూడా టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన విధివిధానాల ఖరారులో జాప్యం జరుగుతుండటంతో వాహనదారుల్లో అయోమయం నెలకొంది. నంబర్ ప్లేట్లను మార్చాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై ప్రజల అభ్యంతరాలను స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. మరో రెండుమూడు రోజుల్లో దీనిపై సమీక్షించి తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
 
 ఉచితంగా చేయాలంటే కష్టమే...
 
 ప్రస్తుతం తెలంగాణలో 73 లక్షల వాహనాలున్నాయి. వీటన్నింటి నంబర్లను తెలంగాణ సిరీస్‌లోకి మార్చాలి. నంబర్ ప్లేటుపై ఏపీ బదులు టీఎస్, జిల్లా కోడ్ సంఖ్య స్థానంలో కొత్త సంఖ్య మార్పించటం పెద్ద సమస్య కాదు. అయితే నంబర్ ప్లేటుపై జరిగిన మార్పునకు తగ్గట్టుగా అధికారిక పత్రాల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆర్‌సీ బుక్కుకు సంబంధించి మార్పు చేయాలి. ఆమేరకు వాహనదారులకు కొత్త కార్డును జారీ చేయాల్సి ఉంటుంది. 73 లక్షల వాహనదారులకు కొత్త కార్డులు జారీ చేయటం ఖర్చుతో కూడుకున్న పని అయినందున దానికి తగిన రుసుము విధించకతప్పదని అధికారులు భావిస్తున్నారు. అయితే మొత్తం భారం వాహనదారుడిపై పడకుండా ఆ రుసుము తక్కువ ఉండేలా చూడాలని యోచిస్తున్నారు.

 

అందులో భాగంగా ద్విచక్రవాహనాలకు రూ.100, మూడు చక్రాలు, కార్లు, అంతకంటే పెద్ద వాహనాలకు రూ.200 చొప్పున రుసుము విధించవచ్చని భావిస్తున్నారు. ఇక హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ ఇప్పటికే రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఏడాది గడువు విధించింది. ప్రస్తుతం ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల వాహనాలకు ఎలాగూ ఈ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాల్సి ఉంది. ఆ మొత్తాన్ని  వాహనదారులు భరించాల్సిందే.
 
 అందని అభ్యంతరాలు...
 
 ఏపీ సిరీస్‌లో ఉన్న వాహనాల నంబర్‌ప్లేట్లను టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలంటూ ఇటీవల ఆదేశించిన ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలుంటే తెలపాల్సిందిగా కూడా సూచించింది. అయితే ఈ విషయంపై సమాచారం ప్రజల్లోకి వెళ్లకపోవటంతో ఇప్పటి వరకు పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కొన్ని జిల్లాలకు సంబంధించిన లారీ అసోసియేషన్లు, కొంతమంది వ్యక్తులు మాత్రమే దీనిపై అభ్యంతరాలు అందజేశారు. సోమ, మంగళవారాల్లో ఈ తంతు కూడా ముగిసినట్టు ప్రకటించి తుది నిర్ణయం వెల్లడించాలని రవాణా శాఖ యోచిస్తోంది. అంటే సోమవారం వరకు ఎవరైనా అభ్యంతరాలుంటే వెల్లడించే అవకాశం ఉంది. రవాణాశాఖ అధికారులకు ఫోన్, లేఖలు, వినతిపత్రాల రూపంలో, లేదా నేరుగా కార్యాలయాలకు వెళ్లి మౌఖికంగా.. అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement