
అంధకారంలో ‘గాంధీ’
- మొరాయించిన జనరేటర్లు
- నిలిచిపోయిన అత్యవసర సేవలు
- టార్చిలైట్ల వెలుగులో శస్త్రచికిత్సలు
- పాఠం నేర్వని యంత్రాంగం
గాంధీ ఆస్పత్రి: ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని చూస్తే అర్థమవుతుంది. వేల మంది పేద రోగులకు ప్రాణ దానం చేసే ఈ ఆస్పత్రిని కొన్నాళ్లుగా సమస్యలు చుట్టుముడుతున్నా నాయకులు గాని, అధికారులు గాని పట్టించుకోవడం లేదు.
శనివారం ఆస్పత్రికి నాలుగు గంటల పాటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీని ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు కరెంటు పోయింది. జనరేటర్లు పనిచేయక పోవడంతో ఆస్పత్రిలో పరిస్థితి దారుణంగా మారింది. అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. వెంటిలేటర్ల బ్యాకప్ అయిపోవడంతో అత్యవసర విభాగాల్లోని రోగులకు మాన్యువల్‌గా ఆక్సిజన్‌ను పంపింగ్ చేశారు.
టార్చిలైట్లు, సెల్‌ఫోన్ల వెలుగులో వైద్యసేవలు అందించిన దుస్థితి దాపురించింది. వార్డులో చీకట్లు అలుముకోవడంతో రోగులు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు జనరేటర్లను మరమ్మతు చేసేసరికి డీజిల్ అయిపోయింది. దీంతో సిబ్బంది డీజిల్ కోసం పరుగులు తీశారు. సుమారు రెండు గంటల పాటు సాగిన గందరగోళానికి పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. దీనిపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రెండు గంటల తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
గతంలోనూ ఇదే పరిస్థితి..
ఈ ఏడాది జూన్ 22,24 తేదీల్లో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. శస్త్ర చికిత్సలు నిలిచిపోవడంతో వైద్యులే ఆస్పత్రి పాలనా యంత్రాంగం తీరును తూర్పారబట్టారు. తరుచూ ఇటువంటి ఘటనలే జరుగుతున్నా నిర్లక్ష్యవైఖరి వీడక పోవడంపై రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్‌ప్లాంట్ నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. ఈ ఘ టనపై ఆస్పత్రి ముఖ్య అధికారి ఒకరిని వివరణ కోరగా నిర ్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. పది నిమిషాలే విద్యుత్‌కు అంతరాయం కలిగిందని, ఎటువంటి అపాయం జరగ లేదనడం గమనార్హం.