చేవెళ్ల రూరల్: ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న విత్తనాలు పొందడంలో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోరిన విత్తనం లేదంటున్న అధికారులు.. ఏదో ఓ కంపెనీ విత్తనాలు అంటగట్టేస్తున్నారు. గత్యంతరం లేక రైతులు వాటినే తీసుకెళ్తున్నారు. చేవెళ్ల మండలంలోని చాలా గ్రామాల్లో రైతులు కూరగాయలు పండిస్తారు. విత్తనాల కోసం ఆయా గ్రామాల నుంచి గురువారం చేవెళ్లలోని ఉద్యానశాఖ కార్యాలయానికి రైతులు తరలివచ్చారు.
ఈ ఏడాది ప్రారంభంలో అధికారులు కోరుకున్న విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. కానీ తీరా అదను వచ్చే సరికి డిమాండ్ ఉన్న కంపెనీల విత్తనాలు తెప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్సిడీపై కోరుకున్న విత్తనాలు వస్తాయని దాదాపు వెయ్యి మంది రైతులు డీడీలు కట్టేందుకు ముందుకొచ్చారు. అయితే ఉద్యానశాఖ కార్యాలయంలో డీడీలు చెల్లించేందుకు వచ్చిన రైతులు ఏఏ కంపెనీల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు.
డిమాండ్ అధికంగా ఉన్న మేలు రకం విత్తనాలు లేకపోవడంతో అధికారులను నిలదీశారు. కొందరు రైతులు విత్తనాలు తీసుకోకుండా వెళ్లగా, మరికొందరు సబ్సిడీపై వస్తున్నాయని భావించి తీసుకెళ్లారు. మొత్తంగా విత్తనాలకోసం సుమారు 300 మంది రైతులు డీడీలు కట్టారు. మరికొందరు డీడీలు కట్టేందుకు సిద్ధంగా ఉన్నా ఎస్సీ, ఎస్టీ రైతులకే సబ్సిడీ వస్తుందని చెప్పడంతో నిరాశగా వెళ్లిపోయారు.
ఇదా 50 శాతం సబ్సిడీ..
ఆయా కంపెనీల విత్తనాలపై ఇస్తున్న సబ్సిడీ చూసి రైతులు బిత్తరపోతున్నారు. ప్రస్తుతం రైతులకు సబ్సిడీపై ఇస్తున్న క్యారెట్, బీట్‌రూట్ విత్తన ప్యాకెట్ల ధరకు, బయట లభిస్తున్న అదే ప్యాకెట్ల ధరకు కొద్ది మొత్తంలోనే తేడా ఉంటోంది. సబ్సిడీపై ఇస్తున్న బీట్‌రూట్ విత్తన డబ్బాను రూ.125కు ఇస్తున్నారు. అదే డబ్బా బయట మార్కెట్‌లో రూ.175కు దొరుకుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. క్యారెట్ విత్తన డబ్బా సబ్సిడీపై రూ.280కి వస్తుండగా అదే బయట మార్కెట్‌లో రూ.350కి వస్తోంది. నిజానికి 50 శాతం సబ్సిడీ అంటే ప్రభుత్వం నుంచి సగం ధరకే రావాలి. కానీ అదే కంపెనీ.. ఎమ్మార్పీపై రేటు తగ్గించి బయట విక్రయిస్తోంది. దీంతో రైతులు 50శాతం సబ్సిడీపై పెదవి విరుస్తున్నారు.
ఆ ‘విత్తనం’ లేదు.. ఇది తీస్కో!
Published Thu, Jul 3 2014 11:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement