ఆలో‘చించే’ పడేశారా? | Old Files And Documents Are Move To Garbage In Telangana Secretariat | Sakshi
Sakshi News home page

ఆలో‘చించే’ పడేశారా?

Published Fri, Aug 23 2019 2:05 AM | Last Updated on Fri, Aug 23 2019 4:01 AM

Old Files And Documents Are Move To Garbage In Telangana Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నిన్న మొన్నటి వరకు విలువైన కాగితాలేనని భద్రంగా దాచిపెట్టుకున్న కాగితాలను ఇప్పుడు ముక్కలుముక్కలుగా చించేసి పడేశారు. ఇది కూల్చివేతకు సిద్ధ మవుతున్న రాష్ట్ర సచివాలయ భవనాల్లోని దృశ్యం. సామాన్య ప్రజలతో పాటు వివిధ వర్గాల నుంచి వందలు, వేల సంఖ్యలో వచ్చిన అర్జీలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టిన సచివాలయ అధికారులు.. చివరకు సచివాలయ కార్యాలయాల తరలింపును సాకుగా చూపుతూ ఇలా వదిలించుకుని చేతులు దులుపుకుంటున్నారనే అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలతో పాటు పాత జీవోల కాపీలు, సర్క్యులర్లు, ప్రభుత్వ శాఖల మధ్య అంతర్గత వ్యవహారాలకు సంబంధిం చిన పాత లేఖలు, ప్రభుత్వ సమావేశాలకు సంబంధించిన కాగితాలను ముక్కలు ముక్కలుగా చించి చిందరవందరగా పడేస్తు న్నారు. పాత సచివాలయ భవనమంతా కుప్పలుతెప్పలుగా పడేసిన కాగితాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ రోజైనా తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అర్జీలు పెట్టుకున్న వ్యక్తులు ఓ వైపు నిరీక్షిస్తుంటే.. వారికి తెలియకుండానే వీటన్నింటినీ బుట్టదాఖలు చేసేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చించిపడేసిన కాగితాల్లో వివిధ సమస్యలపై సామాన్య ప్రజల నుంచి వచ్చిన అర్జీలే ఎక్కువగా ఉండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. రోజూ సచివాలయానికి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీలు పెట్టుకుంటూ ఉంటారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతస్థాయి వ్యక్తుల సిఫారసులు ఉన్న కొన్నింటికి మాత్రమే పరిష్కార యోగం లభిస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాదాసీదా వ్యక్తుల అర్జీలు ఏళ్ల తరబడి సంబంధిత సెక్షన్ల అధికారుల వద్దే పెండింగ్‌లో ఉంటాయని, ఇలా నిర్లక్ష్యానికి గురైన ఫైళ్లను అవసరమైనప్పుడు వెతికినా దొరకని విధంగా వాటిని ఎక్కడో పడేస్తారని ఓ సీనియర్‌ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇలా అదృశ్యమైన తమ ఫైళ్లను వెతుక్కుంటూ వచ్చే వారు ఎందరో ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం సచివాలయం ఖాళీ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఫైళ్లు, అర్జీలు బయటపడితే వాటిని అక్కడికక్కడే చించిపారేస్తున్నారన్నారు. ఇలా మొత్తం సచివాలయం ఖాళీ చేసేసరికి టన్నుల కొద్దీ కాగితాలు, పాత ఫైళ్లు బుట్టదాఖలు కావడం ఖాయమని సచివాలయ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బీఆర్కే భవన్‌కు ఫైళ్లు
ప్రస్తుత సచివాలయంలోని భవనాలన్నింటినీ కూల్చివేసి అక్కడే ఆధునిక సదుపాయాలతో కొత్త సచివాలయ భవన సముదాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను ఖాళీ చేసే క్రమంలో.. ఇక్కడి కార్యాలయాలను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌కు తరలిస్తోంది. గత సోమవారం ప్రారంభమైన సచివాలయం శాఖల కార్యాలయాల తరలింపు వేగవంతమైంది. సాధారణ పరిపాలన శాఖ సూచనల మేరకు ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రికి సంబంధించిన జాబితాలను అన్ని శాఖలు తయారు చేసుకున్నారు. తరలింపు సమయంలో ఫైళ్లు, ఇతర సామగ్రి గల్లంతు కాకుండా ఈ జాబితాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి వచ్చిన అర్జీల ఫైళ్లను ‘ప్రాధాన్యత లేనివి’గా పరిగణించి వాటిని తాత్కాలిక సచివాలయానికి తరలించకుండా ఇక్కడే వదిలించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సచివాలయం డీ–బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సంక్షేమ శాఖలు, కమర్షియల్‌ ట్యాక్సుల శాఖలు, పై అంతస్తుల్లోని రెవెన్యూ, సీ–బ్లాక్‌ తొలి అంతస్తులో జీఏడీ కార్యాలయాల వద్ద ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చించిపడేసిన కాగితాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమ శాఖలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల లబ్ధిదారుల నుంచి వచ్చిన అర్జీలను ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పెట్టి ఇప్పుడు బుట్టదాఖలు చేశారనే విమర్శలొస్తున్నాయి. తక్షణమే సచివాలయ తరలింపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించడం కూడా ప్రాధాన్యత లేని ఫైళ్లు, కాగితాలపై ఆలోచించకుండానే పడేస్తున్నారన్న చర్చమొదలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement