
తాండూరు టౌన్: పాడైపోయిన ఓ కారుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని వాల్మీకినగర్‌కు చెందిన పత్తర్‌షెడ్ వీరన్న (70) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నప్పటికీ వేరుగా ఉంటున్నాడు. కొన్నేళ్లుగా స్థానిక మర్రిచెట్టు కూడలి సమీపంలోని గల్లీలో పాడైపోయిన ఓ కారులో రాత్రిళ్లు నిద్రిస్తున్నాడు.
ఈక్రమంలో ఆదివారం మర్రిచెట్టు కూడలి వద్ద ఉన్న రక్తమైసమ్మ జాతర సందర్భంగా కారు నిలిపి ఉంచిన సమీపంలో టెంటు వేసి కొందరు వంటలు చేశారు. వీరన్న ఎప్పటిమాదిరిగానే అర్ధరాత్రి కారులో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు టెంటుకు నిప్పంటుకుని కారుపై పడిపోవడంతో దానికి నిప్పంటుకుంది. దీంతో కారులో నిద్రిస్తున్న వీరన్న సజీవ దహనమై గుర్తు పట్టలేని స్థితిలో బూడిదగా మారాడు. మద్యం మత్తులో ఉండటం వల్ల వీరన్న తప్పించుకోలేక మంటల్లో చిక్కుకుని మృతిచెంది ఉంటాడని డీఎస్పీ అనుమానం వ్యక్తంచేశారు. మృతుడి కుమారులు రఘు, చిన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment