‘కమీషన్ కాకతీయ’ పై సర్కార్ దృష్టి!
మంత్రి హరీష్ సమీక్ష
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరాదని అధికారులకు మార్గనిర్దేశం
ఫిర్యాదుల సేకరణకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
హైదరాబాద్: ‘మిషన్ కాకతీయ’లో భాగంగా చెరువుల పునరుద్ధరణ పనుల్లో రాజకీయ నేతలు కమీషన్లకు పాల్పడుతున్నారన్న ‘సాక్షి’ కథనంపై నీటి పారుదల శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఈ కథనంపై మంగళవారం సచివాలయంలో అధికారులతో విసృ్తతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. పనుల ఆరంభానికి క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు, అధికారులకు స్థానికంగా ఎదురవుతున్నా సమస్యలపై ఆరా తీశారు. అధికారులెవరూ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరాదని, అలాంటివాటిని తమ దృష్టికి తేవాలని సూచించారు.
పనుల్లో అత్యంత పారదర్శకత పాటించాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని, దీనికి విరుధ్దంగా ఎవరు వ్యవహరించినా కఠినంగా ఉంటామనే హెచ్చరికను ఆయన పం పినట్లుగా తెలుస్తోంది. అధికారులు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చిన మంత్రి, రాజకీయ జోక్యం తగ్గించేందుకు తమ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపినట్లుగా సమాచారం. ఇక మిషన్ కాకతీయ పనులపై క్షేత్రస్థా యిలో ఎదురౌతున్న ఇబ్బందులను ఎప్పటికప్పు డు స్వీకరించి, వాటికి పరిష్కారాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ బాధ్యతలను నీటి పా రుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషికి అప్పగించినట్లుగా శాఖ వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యేక బార్‌కోడ్..
ఇదే సమయంలో మంత్రి ఇంజనీరింగ్ విభాగాలు, సచివాలయం ఉద్యోగుల మధ్య ఉండాల్సిన సమన్వయంపైనా ప్రత్యేకంగా అధికారులకు సూచనలు చేశారు. శాఖ ఫైళ్ల కదలికలో వేగం, పారదర్శకత పెంచాలని, అవసరమైతే ఫైళ్ల కదలికలో బార్‌కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సోమ, బుధవారాల్లో సాగునీటి ప్రాజెక్టులపై, శనివారం మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్‌ను కచ్చితంగా నిర్వహించాలని సూచించారు.
రంగంలోకి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
మిషన్ కాకతీయ పెద్ద ఎత్తున ఆరంభమై, వేగ వంతమైన నేపథ్యంలో పనుల పర్యవేక్షణపై విజి లెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగిం ది. ఇప్పటివరకు పరిపాలనా అనుమతులు ల భించిన చెరువుల వివరాలు, అందులో టెండర్లు ఖరారైనవి, ఒప్పందాలు కుదుర్చుకున్నవి తదితరాల వివరాలన్నింటినీ విజిలెన్స్ శాఖ తెప్పించుకున్నట్లు తెలిసింది. పునరుధ్దరణ పనులు మరింత పుంజుకున్నాక తమ కార్యాచరణ ఆరంభిస్తామని శాఖ అధికారులు వెల్లడించారు.