కోల్ ఇండియా చైర్మన్‌గా నియమితులైన సింగరేణి సంస్థ సీఎండీ సుధీర్థ భట్టాచార్య 27న విధుల నుంచి రిలీవ్ కానున్నారు.
గోదావరిఖని : కోల్ ఇండియా చైర్మన్‌గా నియమితులైన సింగరేణి సంస్థ సీఎండీ సుధీర్థ భట్టాచార్య 27న విధుల నుంచి రిలీవ్ కానున్నారు. 1985 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఆయన రెండేళ్లుగా సింగరేణి సంస్థ సీఎండీగా పనిచేస్తున్నారు. కోల్‌ఇండియా చైర్మన్‌గా వ్యవహరించిన 1986 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగరావు గత మే నెలలో కోల్‌ఇండియా సీఎండీ పదవికి రాజీనామా చేశారు. ఆయన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులయ్యారు.
అప్పటి నుంచి కోల్ ఇండియాకు పూర్తిస్థాయి సీఎండీ లేకపోవడంతో బొగ్గుశాఖ అదనపు కార్యదర్శి ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 30 లేదా 31న భట్టాచార్య కోల్‌ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా బొగ్గుశాఖ అదనపు కార్యదర్శి ఏకే దూబే నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. బొగ్గు పరిశ్రమపై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు 2015 జనవరి 6 నుంచి ఐదు రోజుల పాటు కోల్‌ఇండియాలో సమ్మె చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం సుధీర్థ భట్టాచార్యను వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన సింగరేణి నుంచి రిలీవ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. 27న హైదరాబాద్ సింగరేణి భవన్‌లో భట్టాచార్యను సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, ప్రాతినిథ్య సంఘాలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్ నాయకులు ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.