చెత్తమయం
కనీస వేతనాల అమలు కోసం మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మె గురువారంతో నాలుగు రోజులు పూర్తయింది. చాలీచాలని వేతనాలతో ఇల్లు గడవడం కష్టంగా మారుతోందని, పెరుగుతున్న జీవన వ్యయూలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కార్మికులు సమ్మెబాట పట్టారు. పారిశుధ్య కార్మికుల సమ్మెతో మున్సిపాలిటీల్లోని గల్లీలన్నీ చెత్తమయంగా మారుతున్నాయి. రోజురోజుకు చెత్తకుప్పలు పెరుగుతుండడంతో పట్టణ ప్రజలు ఈగలు, దోమలు, దుర్వాసన మధ్య జీవితం గడుపుతున్నారు.
- కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె
- సమ్మెతో స్తంభించిన పారిశుధ్య నిర్వహణ
- వీధుల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం
- ఈగలు, దోమలు, పందుల స్వైరవిహారం
- జిల్లా కేంద్రంలో కనిపించని ప్రభావం
- కాంట్రాక్టు సిబ్బంది గోడు పట్టని సర్కారు
కరీంనగర్ : జిల్లాలో రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపాలక సంస్థలు ఉండగా, కరీంనగర్ కార్పొరేషన్ మినహా మిగతా పది చోట్ల సమ్మె ప్రభావం ఉంది. రామగుండం కార్పొరేషన్‌తో పాటు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, సిరిసిల్ల మున్సిపాలిటీలు, పెద్దపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, వేములవాడ నగర పంచాయతీల్లో మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో 363 మంది, జగిత్యాలలో 292 మంది, సిరిసిల్లలో 125 మంది, కోరుట్లలో 145 మంది, మెట్‌పల్లిలో 124 మంది, వేములవాడలో 154 మంది, పెద్దపల్లిలో 110 మంది, హుజూరాబాద్‌లో 100 మంది, హుస్నాబాద్‌లో 100 మంది, జమ్మికుంటలో 117 మంది కాంట్రాక్టు కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొంటుండడంతో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది.
దీంతో చెత్తను తీసేందుకు సిబ్బంది లేకపోవడంతో ఆయూ పట్టణాల్లో పారిశుధ్యం పడకేసింది. రోజూ చెత్త తీస్తేనే రోడ్ల వెంట చెత్త కుప్పలు కనిపించే మున్సిపాలిటీల్లో నాలుగు రోజుల సమ్మె ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. చెత్తకు తోడు పందులు చేరి నానా హంగామా చేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కలెక్షన్ పాయింట్ల సమీపంలో ఉండే నివాసాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెను కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదని కార్మిక సంఘ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికులు కోరుతున్నారు.
పర్మినెంట్ కార్మికులు పదుల సంఖ్యలోనే..
చెత్తను తొలగించేందుకు ఆయా మున్సిపాలిటీల్లో పదుల సంఖ్యలో ఉన్న పర్మినెంట్ కార్మికులను ఉపయోగిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికులు లేకపోవడంతో పర్మినెంట్ కార్మికులతో చేపట్టే పారిశుధ్య పనులు ఏ మూలనా పూర్తిగా జరగడం లేదు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకపోడంతో చెత్త తొలగేంచే మార్గమే కనబడకుండా పోతోంది. సమ్మె ఇలాగే కొనసాగితే పేరుకుపోతున్న చెత్తతో అంటువ్యాధులు, విషజ్వరాలు, ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో కనిపించని ప్రభావం
కరీంనగర్‌లో సమ్మె ప్రభావం కనబడడం లేదు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ కార్మిక విభాగానికి చెందిన సంఘంలోనే మెజారిటీ కార్మికులు సభ్యులుగా ఉండడంతో విధులకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు. నగరపాలక సంస్థలో మొత్తం 747 మంది కార్మికులు పనిచేస్తుండగా, సీఐటీయూలో 70 మంది కార్మికులు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. వీరంతా సమ్మెలో పాల్గొంటున్నారు. మిగతా 667 మంది కార్మికులు విధుల్లో ఉండడంతో సమ్మె ప్రభావం మచ్చుకు కూడా కానరావడం లేదు. జిల్లా కేంద్రంలో సమ్మె ప్రభావం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు సైతం పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారు.