
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కొలువుదీరిన ఆపద్ధర్మ ప్రభుత్వం తొలిరోజు సాధారణంగా పూర్తయ్యింది. సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాలు అన్ని ఎప్పటిలాగే సాగాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్.. హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభకు వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారిక కార్యక్రమాలేవి జరగలేదు. సీఎంవో అధికారులకు ప్రస్తుతం ప్రగతిభవన్‌లో, సచివాలయంలోని సీ బ్లాక్‌లో రెండు చోట్ల కార్యాలయాలు ఉన్నాయి. ఆయా రోజుల్లో ఉండే సమీక్షలు, సమావేశాల ప్రకారం వీరు ప్రగతిభవన్‌కు, సచివాలయంలోని సీఎంవోకు వెళ్తుంటారు. ఆపద్ధర్మ ప్రభుత్వం తొలిరోజు సీఎంవో అధికారులు అందరూ సచివాలయానికే వచ్చారు.
సచివాలయం సీ బ్లాక్‌లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల చాంబర్లు, పేషీలో అవసరమైన మార్పులను గురువారమే పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఎప్పటిలాగే ఉదయమే సచివాలయా నికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, ఎ.శాంతికుమారి, కార్యదర్శి భూపాల్‌రెడ్డి సచివాలయానికి వచ్చారు. అన్ని శాఖల్లోనూ యథావిధిగా కార్యకలాపాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మొత్తం 32 శాఖలు ఉండగా.. తొలిరోజు 10 శాఖలు మాత్రమే ఉత్తర్వులను జారీ చేశాయి. శుక్రవారం జారీ అయిన 21 జీవోల్లో కీలకమైన నిర్ణయాలేవి లేవు. సాధారణ పరిపాలన శాఖ ఐఏఎస్ అధికారి జోత్య బుద్ధ ప్రకాశ్‌ను బదిలీ చేస్తూ.. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వేతనం ఖరారుపైనా పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చాయి. ఇవి మినహా కీలకమైన అంశాలకు సంబంధించిన నిర్ణయాల ఉత్తర్వులు ఏవీ జరగలేదు.