ఇంటర్‌ బోర్డు ముట్టడి | Opposition Parties Protest At Inter Board Arrest | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ బోర్డు ముట్టడి

Published Tue, Apr 30 2019 1:28 AM | Last Updated on Tue, Apr 30 2019 5:20 AM

Opposition Parties Protest At Inter Board Arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాలకు బాధ్యులైన వారిపై చర్యలకు డిమాండ్‌ చేస్తూ సోమవారం అఖిలపక్షం చేపట్టిన ఇంటర్మీడియట్‌ బోర్డు ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఫలితాల్లో తప్పులు చోటుచేసుకొని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డా.. ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో పాటు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ విపక్షాలన్నీ సోమవారం ఇంటర్మీడియట్‌ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ ముట్టడికి విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు మద్దతుగా నిలిచారు. ఉదయం 10గంటల కల్లా అన్ని పార్టీల నాయకులు అక్కడకు చేరుకుని ఆందోళనలో పాల్గొనేందుకు సిద్దమవుతుండగా.. పోలీసులు శాఖ ముందుస్తు చర్యల్లో భాగంగా ఇంటర్మీడియట్‌ బోర్డు వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. వందల సంఖ్యల్లో పోలీసులను మోహరించి ఆందోళనకారులను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, ముందస్తు అరెస్టులతో ముఖ్య నాయకులెవరూ ఇంటర్‌ బోర్డువద్దకు రానప్పటికీ, విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు, తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

మూకుమ్మడి అరెస్టులు
అఖిలపక్షం ఆధ్వర్యంలో ముట్టడి కావడంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఇంటర్మీడియట్‌ బోర్డు వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా విడతల వారీగా విద్యార్థి సంఘాల నేతలు సైతం అక్కడికి చేరుకోవంతో ఆందోళనకారుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ముట్టడికి వచ్చిన వారిని వచ్చినట్లుగా అరెస్టు చేశారు. తద్వారా ఆందోళన తీవ్రం కాకుండా సద్దుమణుగుతుందని పోలీసులు భావించారు. కానీ పోలీసుల వ్యూహాలను వమ్ముచేస్తూ.. విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా ఇంటర్‌బోర్డు వైపు దూసుకొచ్చాయి. వందల సంఖ్యలో విద్యార్థి నాయకులు దూసుకురావడంతో పోలీసులు సైతం విస్తుపోయారు. వారికి కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆందోళనకారులు బారీకేడ్‌లు దాటుకుని ఇంటర్‌బోర్డు కార్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నించగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్‌కు తరలించారు.
 
బాధ్యులపై చర్యలేవి?
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తప్పులకు బాధ్యులెవరో తేలినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని అఖిలపక్ష పార్టీలు తప్పుబట్టాయి. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశాయి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కూడా కోరాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థిసంఘాలు, అఖిలపక్ష నేతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నినాదాలు చేయడంతో ఇంటర్‌బోర్డు కార్యాలయం దద్దరిల్లింది. ఇంటర్‌బోర్డు అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని మాజీమంత్రి జే.గీతారెడ్డి డిమాండ్‌ చేశారు. అవకతవకలపై ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. గాంధీభవన్‌ నుంచి బోర్డు వద్దకు చేరుకుంటున్న ఆమెను పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవతారాయ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమని, ఇంతమంది మృతి చెందినా కేసీఆర్‌ స్పందించకపోవడం దారుణమన్నారు. గ్లోబరీనాపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, సిట్టింగ్‌ జడ్జితో ఈ వివాదం మొత్తాన్ని న్యాయవిచారణ చేయాలన్నారు. అరెస్టులతో నిజాన్ని కప్పిపుచ్చలేరన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జనసేన రాష్ట్ర నాయకులు శంకర్‌గౌడ్‌ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి బోయినపల్లి రాము, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్‌కుమార్, పీవైఎల్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, ఏఐడీఐఎస్‌ఓ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్‌ల తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
 
ప్రగతిభవన్‌ వద్ద ఏబీవీపీ అలజడి
ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అవకతవకలపై చర్యలకు డిమాండ్‌ చేస్తూ.. సోమవారం ప్రగతిభవన్‌ వద్ద ఏబీవీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు ప్రగతిభవన్‌వైపు దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. ఏబీవీపీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారికి కట్టడి చేసేందుకు ప్రయత్నించినా.. విద్యార్థులు బారీకేడు దాటేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రగతిభవన్‌ గేటు వద్దే విద్యార్థినాయకులు బైఠాయించారు. ఇంటర్‌ ఫలితాల్లో అక్రమాలకు పాల్పడిన వారిని ప్రభుత్వమే వెనకేసుకోస్తోందని, వారిపై చర్యలు తీసుకునే వరకు కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో కొందరు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. తమ ఉద్యమం ఇంతటితో ఆగదని, ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోమని ఏబీవీపీ నాయకులన్నారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ వారిని సముదాయించేందుకు యత్నించినా వెనక్కుతగ్గలేదు. దాదాపు గంటన్నరపాటు ఉద్రిక్తత అనంతరం వారిని బలవంతంగా అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌కు తరలించారు. సోమవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలువురు పోలీసులు, ఏబీవీపీ నాయకులకు వడదెబ్బ తగిలింది. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది విద్యార్థులకు తాగేందుకు మంచినీళ్లు కూడా అందించారు.  
 
ఎక్కడికక్కడే గృహనిర్బంధాలు
అఖిలపక్షం నిర్వహించ తలపెట్టిన ‘చలో ఇంటర్‌బోర్డు’కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వస్తున్న అన్ని విపక్ష పార్టీలకు చెందిన నేతలను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడే అరెస్టు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, సీపీఐ, టీడీపీకి చెందిన పలువురు నేతలను సాయంత్రం వరకు గృహ నిర్బంధం చేసిన పోలీసులు మరికొందరిని అదుపులోనికి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఇంట్లోకి వెళ్లి మరీ అదుపులోనికి తీసుకుని ఆయన్ను జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, యూత్‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌లను పాతబస్తీలోని వారి నివాసం వద్దే అదుపులోనికి తీసుకుని కంచన్‌బాగ్‌ పీఎస్‌కు తరలించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలను వారి ఇళ్లలోనే అరెస్టు చేసి బంజారాహిల్స్‌ పీఎస్‌కు తరలించారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేయగానే (పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా) ఆయన్ను అదుపులోనికి తీసుకున్నారు. అంతకుముందు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. టీపీసీసీ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్‌లను కూడా గృహ నిర్బంధం చేసి అదుపులోనికి తీసుకున్నారు. కొంతమంది మహిళా నేతలతో కలిసి ఇంటర్‌బోర్డు ముట్టడికి వచ్చిన మాజీ మంత్రి గీతారెడ్డిని అడ్డుకుని సైఫాబాద్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గాంధీభవన్‌ నుంచి ఇంటర్‌బోర్డుకు ర్యాలీగా బయలుదేరిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవతారాయ్‌తోపాటుగా పలువురు పార్టీ నేతలను ఇంటర్‌బోర్డు సమీపంలో అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement