మా బిడ్డ చావుకు కారణమైన వారిపై చర్యల్లేవా!
తల్లిదండ్రుల ఆవేదన
వెల్దుర్తి : ప్రేమించి తమ కుమార్తె గర్భవతిని చేసి, ఆమె చావుకు కారణమైన వ్యక్తి పై ఇటు పోలీసులు అటు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండలంలోని హస్తాల్‌పూర్ పంచాయతీ శంశిరెడ్డిపల్లి తండాకుచెందిన బాధిత తల్లిదండ్రులు సర్మాన్, మంగ్లీలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు తమ గోడును సాక్షితో పంచుకున్నారు. వివరాలు వారి మాట ల్లోనే.. ‘మా ఒక్కగానొక్క కుమార్తె రేణుక స్థానిక కస్తూర్బా పాఠశాలలో 2013 సంవత్సరంలో 9వ తరగతి చదువుతున్న సమయంలో దసరా సెలవులకు ఇంటికి వచ్చింది.
మా తండాకే చెందిన దేవసత్ ఉమ్లా, లక్ష్మిల కుమారుడు (రేణుకాకు వరుసకు బావ) శంకర్ (21) మా కుమార్తెను ప్రేమ, పెళ్లి పేరుతో వంచించి గర్భవతిని చేశాడు. 2013 ఏప్రిల్ 19న కడుపునొప్పి వస్తోందని మా కుమార్తె చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి ఆరునెలల గర్భవతి అని చెప్పారు. ఇదే ఈ విషయాన్ని నిలదీస్తే తనకేమి తెలియదని శంకర్ చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు శంకర్‌ను, అతడి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడగా వారం రోజుల్లో తండాలోనే గిరిజన సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారు.
ఈ క్రమంలో తమ బిడ్డ 2013, జూలై 24న ఓ మగ బిడ్డకు జన్మనిచ్చి తనువు చాలించింది. మరుసటి రోజు మగ శిశువును స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా పీడీ శైలజ శిశు విహార్‌కు తరలించారు. బాబు ఆరోగ్యం క్షీణించి 2013, అక్టోబర్ 30న నిలోఫర్ ఆస్పత్రిలో మృతి చెందినట్లు 2013, నవంబర్ 22న ఉత్తరం ద్వారా తమకు కబురు పంపారు. అప్పట్లో పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయినా తమ బిడ్డ చావుకు కారణమైన శంకర్‌కు ఎటువంటి శిక్షా పడలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎంను కలుస్తాం
మైనర్ బాలికకు గర్భం చేసి, ఆమె చావుకు కారణమైన శంకర్‌ను కఠినంగా శిక్షిం చాలని అప్పట్లో అన్ని శాఖల అధికారులను కలిసి విన్నవించాం. అయి నా లాభం లేకుండా పోయింది. జరిగిన అన్యాయంపై సీఎం కేసీఆర్ కలిసి ఫిర్యాదు చేస్తాం.
- జిల్లా జండర్ కమిటీ సభ్యురాలు ముక్తాబాయి