డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి?
హైదరాబాద్: శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేరును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన మధుసూదనాచారి ఎన్నిక కావడంతో... డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఓసీల నుంచి ఒకరిని ఎన్నుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే, డిప్యూటీ స్పీకర్‌గా వెళితే నియోజకవర్గ అభివృద్ధి, పార్టీకి పనిచేసే విషయంలో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో పద్మా దేవేందర్‌రెడ్డి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ కంటే చీఫ్ విప్ అయినా సరేననే ఆలోచనతో ఆమె ఉన్నారని సమాచారం.
నిర్ణయాల్లో మార్పులేమీ జరగకుంటే డిప్యూటీ స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి మంగళవారం నామినేషన్ వేయనున్నారు. చీఫ్ విప్ పదవికి ఏనుగు రవీందర్‌రెడ్డి(ఎల్లారెడ్డి)ని కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనికి రవీందర్‌రెడ్డి విముఖంగా ఉన్నారు. రవీందర్‌రెడ్డి అంగీకరించకుంటే ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావు పేరును పరిశీలించే అవకాశాలున్నాయి.