గుజరాత్‌లో సఫలమైన వాటర్ గ్రిడ్ పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది
వాటర్ గ్రిడ్ కన్నా పేలియో చానెల్ మిన్న
Published Mon, Oct 20 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM
ప్రముఖ నీటిపారుదలరంగ నిపుణుడు టి.హనుమంతరావు
సాక్షి, హైదరాబాద్: గుజరాత్‌లో సఫలమైన వాటర్ గ్రిడ్ పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే వాటర్ గ్రిడ్ నమూనా కంటే మెరుగైన, చౌక పద్ధతులను సూచిస్తున్నారు ప్రముఖ నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ ఈఎన్‌సీ, ఐక్యరాజ్య సమితి సలహాదారు టి.హనుమంతరావు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలంగాణలో లభ్యమయ్యే భూగర్భ జలాలను గ్రామగ్రామానికి చెరువుల ద్వారా అందించడానికి వీలుందని చెబుతున్నారు. తెలంగాణలో ఉన్న చె రువులతో పోలిస్తే గుజరాత్‌లో 20 వంతు మాత్రమే ఉన్నాయని, అక్కడ భూగర్భ జలాలు ఇంత సమృద్ధిగా లేవని పేర్కొంటున్నారు. అందువల్ల వాటర్ గ్రిడ్ గుజరాత్‌కు మాత్రమే పనికి వస్తుందని ఆయన అంటున్నారు.
తాను రూపొందించిన ‘పేలియో చానెల్ టెక్నాలజీ’తో.. వియత్నాం, ఫిలిిప్పీన్స్ దేశాల్లోని గ్రామాల్లో ప్రజలకు తాగునీరు అందించారని గుర్తుచేస్తున్నారు. ‘పేలియో చానెల్’ టెక్నాలజీతో గరిష్టంగా రూ.3.5 వేల కోట్లతో (పైపులైను వేసే వ్యయ అంచనాలు ప్రస్తుత ధరలకు అనుగుణంగా కాస్త ఎక్కువగా వేసినా) తెలంగాణలోని అన్ని పల్లెలకు తాగునీరు అందించవచ్చని హనుమంతరావు స్పష్టంచేశారు. ఒక్కో ఆవాసానికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వ్యయంతో ప్రభుత్వం ఆశించిన మేరకు మంచినీటి సరఫరా చేయవచ్చంటున్నారు. భూగర్భ మట్టిపొరల్లో నీరు స్వచ్ఛంగా ఉంటుందని, ఈ నీటి సరఫరాతో ఫ్లోరైడ్, ఇతర ఖనిజాల సమస్యలు కూడా తప్పుతాయంటున్నారు. ‘‘బోర్ల ద్వారా రాతి పొరల్లోని నీరు సేకరిస్తే.. ఫ్లోరైడ్ తదితర ఖనిజాల సమస్య తలెత్తుతుంది.
తెలంగాణ ప్రభుత్వం భూఉపరితల నీటిని అందించేందుకు రూ.25 వేల కోట్ల వ్యయంతో 26 గ్రిడ్‌లతో పల్లెల్లోని ప్రజలకు ప్రతిరోజు ఒక్కో మనిషికి 100 నుంచి 135 లీటర్ల తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కార్యక్రమం చేపట్టడం మంచిదే. అయితే.. ఇక్కడున్న జలవనరుల దృష్ట్యా నీటి సేకరణ పద్ధతుల్లో భూగర్భ నీటిపై ఆధారపడి ఎక్కడికక్కడే సరఫరా చేయడం వల్ల భారీ వ్యయం అవుతుంది. కానీ అందులో కేవలం 10 నుంచి 15 శాతం నిధులతోనే ఈ బృహత్తర పథకాన్ని పూర్తి చేయవచ్చు’’ అని ఆయన వివరించారు. నిర్వహణ, అమలు సమస్యలు గ్రిడ్ కంటే కూడా చాలా తక్కువంటున్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రం దక్కన్ పీఠభూమి అని, వర్షాలు పడినా భూమిలోకి ఇంకిపోయే నీరు తక్కువగా ఉంటుందని అధికార యంత్రాంగం చెబుతోంది. కానీ 2012-13 ఆర్థిక గణాంక శాఖ ప్రచురించిన లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో... భూగర్భ జలాల వినియోగంతో దాదాపు 27 లక్షల హెక్టార్లలో పంటలు పండించారు. అంటే దాదాపు 700 టీఎంసీల భూగర్భ జలాల వినియోగంతో పంటలు పండించారు. ప్రస్తుతం ఉన్న భారీ, మధ్య తరహా ప్రాజెక్టులతోపాటు డెల్టాలో సాగైన భూమి కంటే దాదాపు రెట్టింపు పరిణామంలో భూగర్భ జలాలతో సాగ వుతోంది’’ అని ఆయన గుర్తుచేస్తున్నారు. పేలియో చానెల్ టెక్నాలజీతో వేసవిలోనూ, దుర్భిక్ష సంవత్సరాల్లోనూ భూగర్భ జలాలు అందుబాటులో ఉంటాయంటున్నారు.
పేలియో చానెల్ టెక్నాలజీ తీరిదీ..
వర్షం నీరు.. నది లేదా వాగుల్లో ప్రవహిస్తుంది. వాటికి అడ్డుకట్టలు వేయడం వల్ల చెరువులు, సరస్సులను ఏర్పాటు చేయొచ్చు. దీంతో నీరు నిల్వ ఉంటుంది. అయితే వాగుల ప్రవాహం మాత్రం భూమార్గంలో పయనిస్తూనే ఉంటుంది. భూగర్భ వాగు లేదా నది ఏ మార్గంలో పయనిస్తుందన్న అంశాన్ని జియోఫిజికల్ సర్వేలతో నిర్ధారించవచ్చు. చెరువు దిగువ భాగంలో ఉండే ఆయకట్టు ప్రాంతంలో నుంచి ఈ నది/వాగు ప్రవహిస్తున్న ప్రాంతంలో మట్టిపొరల లోతు అధికంగా ఉన్నదాన్ని కనిపెట్టడం ద్వారా.. అక్కడ బావి తవ్వడం, ఆ బావిలో నీటిని గ్రామాల్లోని ప్రజలకు పైపులైను ద్వారా అందించడం వీలవుతుంది. ఇది భూభౌతిక సర్వేల ద్వారా నిర్ణయించే అవకాశం ఉంది. ఎందుకంటే పై భాగంలో నంత ఆయకట్టు ఉంటుంది.. ఆయకట్టు భూములతో కప్పబడి ఉన్నందున అది బయట నుంచి కనపడదు. చెరువు నుంచి దిగువ భాగంలో కిలోమీటరు దూరం వరకు సర్వే చేస్తే అది నీటి ప్రవాహ మార్గం స్పష్టంగా తేలుతుంది. వేసవిలో ఈ భూగర్భ జలాలు దిగువ ప్రాంతాలకు ప్రవహించకుండా ఉండేందుకు ఆయకట్టు చివరలో మట్టిపొరల్లో భూగర్భ ఆనకట్ట కట్టాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement