పార్కులు వెలవెల | Parks And Roads Empty With Bajrang Dal Activists Warning | Sakshi
Sakshi News home page

పార్కులు వెలవెల

Published Sat, Feb 15 2020 8:51 AM | Last Updated on Sat, Feb 15 2020 8:51 AM

Parks And Roads Empty With Bajrang Dal Activists Warning - Sakshi

సందర్శకులు లేక బోసిపోయిన కృష్ణ కాంత్‌పార్కు

ముషీరాబాద్‌/వెంగళరావునగర్‌:  పార్కులు వెలవెలపోయాయి. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కొన్ని ప్రాంతాల్లో పార్కులను మూసివేశారు. మరికొన్ని పార్కుల వద్ద గట్టి  బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు సంవదర్శకులను సైతం అనుమతించలేదు, ‘తాము ప్రేమికులం కాద’ని చెప్పినప్పటికీ అనుమతించలేదని  పలువురు సందర్శకులు విస్మయం  వ్యక్తం చేశారు. వాలెంటైన్స్‌డే బహిష్కరించాలని భజరంగ్‌దళ్‌ తదితర సంస్థలు  కొంత కాలంగా పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు భారీ బందోబస్తు  ఏర్పాటు చేశారు.

దీంతో  ప్రతి రోజు సందర్శకులతో  కిటకిటలాడే ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కృష్ణకాంత్‌పార్కు తదితర పార్కులు  జన సంచారం లేక బోసిపోయాయి. ఇదిలా ఉండగా ఉదయం,  సాయంత్రం వేళల్లో పార్కుకు  వచ్చే వాకర్లు, ఇతర సందర్శకులు సైతం  ఇబ్బందికి గురయ్యారు. జీహెచ్‌ఎంసి పార్కును మూసివేయాలంటే అటు పోలీసులు,  లేదా అర్బన్‌ ఫారెస్ట్రీ అధికారులు గాని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. అయితే అలాంటి ఉత్తర్వులు లేకపోయినా వెంగళరావునగర్, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడకు చెందిన కొందరు యువకులు బుధవారం తెల్లవారుజామున కృష్ణకాంత్‌ పార్కుకు వచ్చి సెక్యూరిటీని బెదిరించి తాళాలు వేయాలని బెదిరించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది భయపడి పార్కుకు తాళాలు వేయకుండా పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం అందించారు. అదే సమయంలో పార్కుకు వచ్చిన వాకర్స్, సీనియర్‌ సిటిజన్స్, మహిళలు పార్కుకు  వచ్చినప్పటికీ   వారిని లోపలికి అనుమతించలేదు.

పోలీసుల అదుపులో కృష్ణకాంత్‌పార్కు...
 కొందరు వాకర్లు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించడంతో టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్‌ సిబ్బంది హుటాహుటిన పార్కు వద్దకు చేరుకుని గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల తర్వాత కేవలం మగవారిని మాత్రమే లోపలికి ప్రవేశించడానికి అటు పోలీసులు, ఇటు పార్కు అధికారులు అనుమతించారు. అంతేగాకుండా బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌ రావు  స్వయంగా వచ్చి పరిస్థితిని సమీక్షించారు.  మధ్యాహ్నం వరకు పార్కుకు వచ్చిన ప్రేమికులు, సందర్శకులను అనుమతించకపోవడంతో నిరుత్సాహంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. దీంతో పార్కులో  50 టిక్కెట్లు కూడా (ప్రైవేటు స్కూల్‌ చిన్నారులు మినహా) విక్రయించలేదని సిబ్బంది తెలిపారు. నిత్యం పండగ వాతావరణాన్ని తలపించే పార్కుల బయట కూడా కళా విహీనంగా మారిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement