సాక్షి, సిరిసిల్ల : ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే జిల్లాలో రాజకీయ రసవత్తరంగా మారుతోంది ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అన్నిపార్టీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. వారం రోజులుగా అన్నిపార్టీల అభ్యర్థులు నామినేషన్ పత్రాలు అందజేస్తూ వస్తున్నారు. పోలింగ్‌కు ఇంకా 19 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో రాజకీయపార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఇదేక్రమంలో పార్టీ గెలుపు కోసం దోహదం చేసే ప్రతిఒక్కరినీ తమ పార్టీలో చేర్చుకుంటూ ప్రజల్లో ఆదరణ పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ద్వితీయ శ్రేణి నాయకులపై క్రేజీ..
వివిధ పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులను తమ పార్టీలో చేర్చుకునే విధంగా అన్నిపార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇదేవరుసలో పలు పార్టీల్లో అసమ్మతులను తమ పార్టీలో చేర్చుకునేలా చర్యలు ఆరంభించాయి. ముఖ్యంగా అన్నిగ్రామాల్లోని యువత, ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి ప్రచారం సాగిస్తే.. ఓటర్లును ప్రభావితం చేయొచ్చన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. చోటమోటా నాయకులను వదలకుండా ఒకటికి పలుమార్లు చర్చలు జరిపి తమకు అనుకూలంగా ఓట్లు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో తమ పార్టీలో చేరడం ఇష్టంలేని వ్యక్తులను ఓట్లను మాత్రం వేయాలని హామీలను తీసుకోవడం ప్రచార తీవ్రతను తెలుపుతోంది. ఇకనేటి(సోమవారం)తో నామినేషన్ల పర్వం పూర్తయి పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరే అవకాశాలున్నాయి. ఇకఅన్నిపార్టీలు బహిరంగ సభల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు ఆరంభించాయి.
మోతెక్కిన ప్రచారం..
జిల్లాలో రాజకీయపార్టీల ప్రచారాల లొల్లి అమాం తం పెరిగింది. ఎన్నికల నిబంధనల మేరకు ఆ యా పార్టీల ప్రచార రథాలు పల్లెలు మొదలు.. పట్టణాల్లో సంచరిస్తూ.. ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. గడిచిన నెల రోజులుగా సిరిసిల్ల, వేములవాడల్లో ప్రచారాలను అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ముమ్మురం చేశాయి. టీఆర్‌ఎస్ నుంచి ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్, చెన్నమనేని రమేశ్‌బాబులు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఊరూవాడ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వివిధ పార్టీల నుంచి వస్తున్న నాయకులు, కులసంఘాల పెద్దలు, మహిళలు, యువతను తమ పార్టీల కం డువాలు కప్పుతూ.. మద్దతును పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన సంకేతాలతో సిరిసిల్ల నుంచి కేకే మహేందర్‌రెడ్డి, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్ తమ విజయం కో సం అన్నివర్గాలతో నేరుగా సమావేశాలు జరుపుతూ..తమ అభ్యర్థిత్వంపై బలాన్ని పెంచుకుంటున్నారు.
బీజేపీ నుంచి గంభీరావుపేట మండలా నికి చెందిన మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్ ను పార్టీ ప్రకటించగా..టిక్కెటును ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీకి దూరం కానుండటంతో అధిష్టానం రంగంలోకి దిగింది. అసంతృప్తులను బుజ్జగింపులతో ఎన్నికల ప్రచారబరిలోకి దింపుతోంది. వేములవాడ నుంచి బీజేపీ అభ్యర్థి ప్రతా ప రామకృష్ణ కూడా పార్టీకి మద్దతుదార్లను పెంచుకుంటూ పోతున్నారు. సిరిసిల్ల బీఎస్పీ నుంచి ఆవునూరి రమాకాంత్‌రావు, న్యూ ఇండియా పార్టీ నుంచి అరవరాజు కృష్ణంరాజు, బీఎల్‌ఎఫ్ నుంచి కూరపాటి రమేశ్ నేరుగా ప్రజలను కలుస్తూ..తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం కొనసాగిస్తున్నారు. జిల్లాలోని పాక్షికభాగం మానకొండూరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ నుంచి రసమయి బాలకిషన్, కాంగ్రెస్ నుంచి ఆరెపల్లి మోహన్, బీజేపీ నుంచి గడ్డం నాగరాజులు తమ ప్రచారం కొనసాగిస్తున్నారు.
ప్రచారానికి దూరం.. మద్దతుకు దగ్గర
జిల్లాలోని ఇరు నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసే కులసంఘాల పెద్దలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పేరుమోసిన వ్యాపారులు ప్రచారంలో దూరంగా ఉంటున్నారు. అయితే తమకు ఇష్టమైన పార్టీకి మద్దతు ఇవ్వడంతో అంతర్గతంగా పావులు కదుపుతూ దగ్గరవుతున్నారని తెలుస్తోంది. సంఘంలో తమ ఇమేజీ, ఇతర పార్టీల నాయకుల్లో కంటుకాకుండా ఆచితూచి మద్దతు పలుకుతున్నారు. ప్రత్యక్ష్యంగా ప్రచారంలో పాల్గొనకున్నా..తమవంతుగా ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేయించే దిశగా అంతర్గత ప్రచారానికి తెరలేపారు. ప్రత్యర్థి పార్టీల్లో అలకలు బూనిన చిన్నాపెద్దా నాయకులను కూడా వదలకుండా వారి ఓట్లను వదులుకోకుండా ఉంటున్నారు. అవసరమైతే తమ పార్టీలో చేర్చుకుని ప్రత్యక్ష్యంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారు.
జోష్ పెంచుతున్న చేరికలు..
ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో పార్టీల్లో చేరుతున్న కొత్తవారితో ఆయా రాజకీయ పార్టీల కేడర్‌లో జోష్ పెరుగుతోంది. నాలుగేళ్లుగా స్తబ్ధుగా ఉంటున్న ద్వితీయశ్రేణి నాయకులు సైతం ఎన్నికల్లో తమ భాగస్వామ్యం ప్రాధాన్యతను అధిష్టానానికి తెలియవచ్చేలా ప్రచారాలను కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో చేరుతున్న మేధావులు, యువత సోషల్ మీడియాలో ప్రచారాలను వైరల్ చేస్తూ..ఓటర్లను తమ పార్టీ వైఖరిపై అవగాహన చేయించడం ఆకట్టుకుంటోంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరడం.. ఇటీవలే జరిగిన పద్మశాలిల కృతజ్ఞత సభ విజయవంతం కావడంతో నేతన్నల ఓట్లపై పట్టుసాధించినట్లు ఆపార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొద్దిరోజులుగా మంత్రి కేటీఆర్ సమక్షంలో పలుగ్రామాల్లో చేరికలు పెరుగుతున్నాయి. వేములవాడ నుంచి కాంగ్రెస్ టిక్కెట్టును ఆశించి భంగపడ్డ ఏనుగు మనోహర్‌రెడ్డి ఆదివారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మరోవైపు సిరిసిల్ల, వేములవాడల్లో ప్రతిపక్ష నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, ఆది శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణ, మల్లుగారి నర్సాగౌడ్ తదితర పార్టీల అభ్యర్థుల సమక్షంలో అత్యధిక సంఖ్యలో చేరికలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో బీఎల్‌ఎఫ్, బీఎస్పీ తదితర పార్టీలు సైతం మద్దతు దారులను, ఓటుబ్యాంకును పెంచుకుంటూపోవడం పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment