కాంగ్రెస్ శ్రేణులతో కిక్కిరిసిన పెద్దపల్లి రహదారులు
పెద్దపల్లి : నామినేషన్ చివరి రోజు పెద్దపల్లి పట్టణం ఒక్కసారిగా జనసంద్రమైంది. వేల సంఖ్యలో గులాబీ శ్రేణులు, ఖద్దరు దుస్తుల కాంగ్రెస్ కండువాలు, కోలాటం గ్రూపు మహిళాబృందాలు, డోల్ దెబ్బ కళాకారులు ఇలా పట్టణంలో ఎక్కడ చూసినా సోమవారం జనంతో కిక్కిరిసిపోయింది. నామినేషన్ వేసేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు పెద్దపల్లి పట్టణానికి అనుచరులతో చేరుకున్నారు. అప్పటికే నామినేషన్ సమర్పించిన తాజా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మరోసారి నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సైతం ఉదయమే నామినేషన్ మరో సెట్ అందించి రంగంపల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా కమాన్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా చేరుకున్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి స్థానిక రైల్వే స్టేషన్ ఏరియా నుంచి ర్యాలీ చేపట్టారు. కళాకారులు, డప్పు వాయిద్యాలు, డోల్‌దెబ్బ బృందాలు గులాబీ దళంతో కలిసి కమాన్ మీదుగా తిరిగి జెండా చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు చేరుకున్నారు. ఉదయం కాంగ్రెస్ ర్యాలీ కంటే మధ్యాహ్నం చేపట్టిన ర్యాలీ రెండింతలుగా ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు. పార్టీ అభ్యర్థులు ఇరువురు సైతం తమ బలాన్ని పదర్శించేందుకు భారీగా జనాన్ని ర్యాలీలో ఉండేలా చూశారు. పార్టీ అభ్యర్థుల ప్రచార రథాలు ముందుకు నడుస్తుండగా.. జనం, కళాకారులు అనుసరిస్తూ ర్యాలీ చేపట్టారు.
ట్రాఫిక్ ఇబ్బందులు
పట్టణంలో రెండు ప్రధాన పార్టీల తమ బల ప్రదర్శనలో టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో కనిపించినట్లు స్థానికుల నుంచి వినిపించింది. గులాబీ దళం ప్రత్యేకించి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టడంతో పలుమార్లు ఇక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. రెండు కిలోమీటర్ల ప్రయాణం దాదాపు 2గంటలపాటు కొనసాగింది. దీంతో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బస్సులు ఇతర వాహనాల రాకపోకలకు తరచూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం స్వయంగా డీసీపీ సుదర్శన్‌గౌడ్, ఏసీపీ వెంకటరమణరెడ్డి రాజీవ్ రహదారిపై విధులు నిర్వహించారు.
డబుల్ ధమాకా
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న వారిలో పార్టీ కార్యకర్తలు కానివారికి కైకిలి(కూలీ) చెల్లించినట్లు పలువురు తెలిపారు. ఉదయం ఒక పార్టీకి ప్రచారానికి వచ్చిన కూలీలు తిరిగి వెంటనే రెండో పార్టీలో తిరగడంతో ఈ పూట తమకు రెండు కూలీలు(కైకిల్లు) పడ్డాయంటూ పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కోవలో మహిళ కూలీలు ఎక్కువ కనిపించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చినవారు రెండు కైకిళ్లు వచ్చాయంటూ ఇంటిదారి పట్టారు.
బీజేపీ వ్యూహాత్మక ప్రచారం
భారీ ర్యాలీ జన సమీకరణను బీజేపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా వాడుకున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రచారానికి వేలాదిగా వచ్చిన జనానికి గుజ్జుల రామకృష్ణారెడ్డి ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేసి కళాకారుల బృందాలతో బీజేపీ రాజకీయాలను పాటల రూపంలో వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment