రైళ్ల రద్దుతో రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడిన దృశ్యం
మంచిర్యాలక్రైం: కాజీపేట బల్లార్షాల మధ్య రైల్వేలైన్ల మరమ్మతు కారణంగా మంగళవారం, బుధవారం పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. ఈ సమాచారం ప్రయాణికులకు తెలియకపోవడంతో మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు మంగళవారం వచ్చిన వారంతా ఇబ్బందులుపడ్డారు. రైళ్ల రద్దు దృష్ట్యా ఆర్టీసీ అధికారులు హైదరాబాద్, వరంగల్ ప్రయాణికులకోసం అదనపు బస్సులు నడపకపోవడంపై జనం మండిపడ్డారు.
సోమవారం హైదరాబాద్, కాజిపేట, వరంగల్ వెళ్లాల్సిన ప్రయాణికులు రైల్వేస్టేషన్ వరకు వచ్చి నానాతంటాలుపడ్డారు. నాగ్‌పూర్ వెళ్లాల్సిన ప్రయాణికులు స్టేషన్లోనే హోటళ్ల నుంచి భోజనం తెప్పించుకొని వేచి ఉండాల్సి వచ్చింది.
రద్దయిన రైళ్లు...
కాజిపేట్, బల్లార్షాల మధ్య చేపట్టిన రైల్వేలైన్ల మరమ్మతులో భాగంగా మంగళ, బుధవారం రెండురోజులపాటు కాజీపేట నుంచి బల్లార్షాలమధ్య నడిచే రామగిరి ప్యాసింజర్‌ను రద్దుచేశారు. భద్రాచలంరోడ్డు, బల్లార్షా మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్‌ను, భద్రాచలం రోడ్డు నుంచి వరంగల్ మధ్య నడుపుతున్నారు. కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాజీపేట వరకే నడుపుతున్నారు.
కాజీపేట నుంచి నాగ్‌పూర్ మధ్య నడిచే అజ్నీ నాగ్‌పూర్ ప్యాసింజర్‌ను రామగుండం వరకే నడిపిస్తున్నారు. మంచిర్యాల నుంచి రైలు ప్రయాణం చేసే ప్రయాణికులకు రెండురోజులపాటు ఇంటర్‌సిటీ, భాగ్యనగర్, రామగిరి, సింగరేణి, నాగ్‌పూర్ అజ్నీ ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు.
ఒకేఒక్క రైలు...
కాగజ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే ఒకేఒక్క కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ ఉండడంతో హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులందరూ సాయంత్రం వర కు బిక్కుబిక్కుమంటూ స్టేషన్లో పడిగాపులు కా యాల్సి వచ్చింది. నాగ్‌పూర్ వైపు, హైదరాబాద్ వైపు వెళ్లే మిగతా రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్, వరంగల్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లేందుకు మంచిర్యాల రైల్వేస్టేషన్ నుంచి అనుకూలమైన రైళ్లు ప్రధానంగా రద్దుకావడంతో జిల్లాలో జన్నారం, కోటపెల్లి, చెన్నూరు, లక్సెట్టిపేట ప్రాంతాల వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం 5గంటలకు కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రావడంతో ప్రయాణికులతో రైలు నిండింది.
అన్నయ్య పెళ్లికి వెళ్లలేకపోయా..
రైళ్లు రద్దు కావడంతో అన్నయ్య పెళ్లికి వెళ్లలేకపోయా. వరంగల్‌లో మా అన్నయ్యది పెళ్లి ఉంది. మా అమ్మనాన్నలు అందరూ వెళ్లారు. నేను తమ్ముడు ఇద్దరం ఈ రోజు ఇంటర్‌సిటీకి వెల్దామని ఆగినం. నీల్వాయి నుంచి సుమారు 70 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చాం. రైళ్లు రద్దు అయ్యాయని చె ప్పారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు సరిపడా డబ్బు లేదు. – రవళి, నీల్వాయి
Comments
Please login to add a commentAdd a comment